ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ జరిగే వరకు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 10 న జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ మోహన్ బాబు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 23న ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అభియోగాలు తీవ్రమైనందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మోహన్ బాబు డిసెంబర్ 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ ధర్మాసనం విచారించింది.
ఎవరైనా లోపలికి వస్తే దాడి చేస్తారా…?
ఈ వాదనలపై జస్టిస్ దులియా స్పందిస్తూ, ఎవరైనా ఇంటిలోకి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా? అని మోహన్ బాబు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గిని ప్రశ్నించారు. తదుపరి విచారణ జరిగేంతవరకు మోహన్ బాబుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, జర్నలిస్టుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/12/mohanbabu-02.jpg)