ప్రజాశక్తి-అమరావతి :సోషల్ మీడియా పోస్టులు అనుచితంగా ఉన్నాయని చెప్పి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాంగోపాల్ వర్మ గతేడాది అక్టోబర్‌లో వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులు చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం, గార్లపాడుకు చెందిన ముత్తనపల్లి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా, తుళ్లూరు, అనకాపల్లి జిల్లా, రావికమతం పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడాన్ని వర్మ సవాల్ చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది.
