46 వేల జాబ్‌ కార్డులు తొలగింపు

Dec 13,2023 10:56 #46, #cards, #job, #Removal, #thousand
  • ఉపాధి పథకంలో కోత పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు తగ్గించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రతియేటా లేబర్‌ బడ్జెట్‌ తగ్గింపు, పనిచేసే చోట సౌకర్యాలు కల్పించకపోవడం, రెండు పూటల పనులతో ఫేస్‌ హాజరు వంటి వాటిని పెట్టి ఉపాధి హామీ పనులకు చాలా మందిని దూరం చేస్తున్నాయి. ఇప్పుడు జాబ్‌ కార్డుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2022-23లో 46,662 జాబ్‌ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 2021-22లో 1,833 జాబ్‌ కార్డులను తొలగించిన ప్రభుత్వం ఈ ఏడాది జాబ్‌ కార్డుల తొలగింపులో వేగం పెంచింది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వలస వెళ్లినవారు, చనిపోయిన వారు లేదా అందుబాటులో లేనివారిని గుర్తించి వారి పేర్లను జాబ్‌ కార్డుల నుండి అధికారులు తొలగిస్తున్నారు. గ్రామీణ కార్మికులు, పేదవారి కోసం ప్రవేశపెట్టిన ఈ ఉపాధి హామీ పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్వర్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా 2021-22లో 3,06,944 జాబ్‌ కార్డులు తొలగించగా, 2022-23లో 7,43,457 కార్డులు తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లో 2021-22లో 67,937 కార్డులు తొలగించగా, 2022-23కు వాటి సంఖ్య 2,96,464 వరకు పెరిగింది. ఒడిశా రాష్ట్రంలో 2021-22లో 50,817 జాబ్‌ కార్డులు తొలగించగా, 2022-23లో 1,14,333 కార్డులు తొలగించారు. మధ్యప్రదేశ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 27,859 జాబ్‌ కార్డులు తొలగించగా, 2022-23లో 95,209 కార్డులు తొలగించారు. బీహార్‌లో సంబంధిన గణాంకాలు ప్రకారం 2021-22లో 27,062 కార్డులు తొలగించగా, 2022-23లో 80,203 కార్డులు తొలగించారు. ఝార్జండ్‌లో 2021-22లో 23,528 జాబ్‌ కార్డులు తొలగించగా, 2022-23లో 70,673 కార్డులు తొలగించారు. రాజస్థాన్‌లో 2021-22లో 14,782, 2022-23లో 45,646 జాబ్‌ కార్డులు తొలగించారు.

➡️