తాడేపల్లి (గుంటూరు) : వైసిపి హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సిఎం జగన్ నివాసం వద్ద రోడ్డుపై సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా అధికారులు తొలగిస్తున్నారు. తాజాగా, సోమవారం రాత్రి జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సులువుగా జరిగేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళితే కట్టడి చేసే టైర్ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్‌లను సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్‌తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్‌పోస్టును కూడా ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రోడ్డు వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి.
