- అడ్డుకున్న వారిపై పోలీసుల ప్రతాపం
- పలువురిని గృహనిర్బంధం
- అర్హులందరికీ ఇంటి పట్టా ఇవ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి- హిందూపురం : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని కొల్లకుంట సమీపంలోగల ప్రభుత్వ స్థలంలో తొమ్మిది నెలల క్రితం పేదలు నిర్మించుకున్న గుడిసెలను పోలీసులు తొలగించారు. సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. పోలీసులు అనుమాష్యంగా వ్యవహరించడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ ఖండించారు. అర్హులందరికీ ఇంటి పట్టా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ పోరాటంలో భాగంగా సుమారు 8.5 ఎకరాల్లో సిపిఎం ఆధ్వర్యంలో 446 నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయి. రెవెన్యూ అధికారులు శనివారం తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు బందోబస్తుతో జెసిబిలతో గుడిసెలను తొలగించారు. దీంతో, పేదల గుడిసెల్లోని సామగ్రి చెల్లాచెదురైంది. గుడిసెలకు వేసుకున్న బండలు, రాళ్లు, రేకులు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల చర్యలను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పలువురు సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను, పేదలను పోలీసులు అరెస్టు చేసి హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు స్టేషన్లకు తరలించారు. దీనిని నిరసిస్తూ సిపిఎం జిల్లా నాయకులు జడ్‌పి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెనుగొండ రహదారిపై పేదలు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులు పలువురి నాయకులను అరెస్టు చేసి లేపాక్షి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో, బాధితులతో కలిసి హిందూపురం తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పేదల సొంతింటి కల మాత్రం నెరవేర్చడం లేదన్నారు. నిలువ నీడలేని నిరుపేదలు సొంతింటి కల నెరవేర్చుకోవడానికి సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటంలో భాగంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం అమానుష్యమన్నారు. ఈ ప్రాంతంలో అర్హులైన నిరుపేదలందరికీ, పాత్రికేయులకు కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టులు, పేదల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇఎస్ వెంకటేష్, భూ పోరాట కమిటీ నాయకులు, పేదలు పాల్గొన్నారు. అరెస్టు చేసిన వారందరినీ పోలీసులు విడుదల చేశారు.