ట్రూఅప్‌ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

  • సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ ట్రూఅప్‌ ప్రతిపాదనలను విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక ధరలతో ఒకవైపు, ఆదాయాలు తరిగిపోయి మరోవైపు ప్రజలు సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలపై రాష్ట్రప్రభుత్వం ఎఫిపిసిఎ పేరుతో తాజాగా రూ.12వేల కోట్లు, ఇటీవల రూ.6వేల కోట్లు మొత్తం రూ.18వేల కోట్ల ట్రూఅప్‌ ఛార్జీల భారం వేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఇటీవల వేసిన రూ.6072 కోట్ల భారం ఇంకా అమల్లోకి రాకముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపడం దారుణమని పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనలో యూనిట్‌ విద్యుత్‌కు గరిష్టంగా రూ.2.50లు వడ్డిస్తున్నారని తెలిపారు. నిరుపేద గృహస్తులు యూనిట్‌కు చెల్లించే రూ.1.90లకు ఇది 130శాతం అధికమని పేర్కొన్నారు. డిస్కంల బహిరంగ ప్రకటనలో మొత్తం ఎంత భారం వేశారో, అది ఎందుకు అవసరమయ్యిందో కనీసం ఒక్క వాక్యం కూడా ఇవ్వకపోవడం ప్రజలను మోసగించడమేనని తెలిపారు. ప్రభుత్వ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి కరెంటు తీసుకోకుండా(బ్యాక్‌ డౌన్‌చేసి) అధిక ధరలకు ఓపెన్‌ మార్కెట్‌లో చెల్లింపులు చేయడం ఇందుకు ముఖ్యకారణమని విమర్శించారు. ప్రైవేట్‌ కంపెనీలకు అడ్డగోలుగా చెల్లింపులు చేయడం మరోకారణమని తెలిపారు. ప్రభుత్వాల తప్పుడు విధానాలు, అవినీతి, అక్రమాలకు ప్రజలను బలిచేయడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు భారాలు మోయాలనడం అసంబద్ధమని పేర్కొన్నారు. మోసపూరితమైన ట్రూఅప్‌ విధానాన్ని రద్దు చేయాలని, మొత్తం రూ.18వేల కోట్ల ట్రూఅప్‌ భారాన్ని ఉపసంహరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️