- రేపటి నుంచి అందుబాటులోకి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఉత్తర్వుల విడుదల నమోదు (జిఒఐఆర్) వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ జిఓ 79ను మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పాలనాపరమైన నిర్ణయాలు ప్రజలకు తెలిసేందుకు goir.ap.gov.in వెబ్‌సైట్‌ను 2008 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఈ వెబ్‌సైట్‌లో ఉండేవి. అయితే గత వైసిపి ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7 నుంచి ఈ వెబ్‌సైట్‌ను పక్కన పెట్టి ఎపిఇగెజిట్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గెజిట్ వెబ్‌సైట్‌లో అన్ని ఉత్తర్వులను కాకుండా కేవలం కొన్నింటిని మాత్రమే పొందుపరిచింది. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలను ప్రజలకు తెలిసేలా జిఒఐఆర్‌ను పునరుద్ధరించాలని గతంలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అన్ని ఉత్తర్వులనూ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా ఆచరణలో మాత్రం పాటించలేదు. జిఒఐఆర్ పునరు ద్ధరణ పట్ల తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.