ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యలో సంస్కరణలు అమలు చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జివో 117ను రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. ఆ జివో రద్దు చేసినా ఇంచుమించు అదే విధానాలను అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం మెమో జారీ చేశారు. గతంలో ఉన్న ఆరు రకాల పాఠశాలలకు బదులు ఐదు రకాల పాఠశాలల విధానాన్ని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ప్రవేశపెట్టిన శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. ఫౌండేషనల్ స్కూళ్లను అలానే కొనసాగించింది. ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ పేరును బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్చింది. ప్రిహైస్కూల్ విధానాన్ని రద్దు చేసి మోడల్ ప్రైమరీ స్కూల్‌గా తీసుకొస్తుంది. 3, 4, 5 తరగతుల విలీనాన్ని రద్దు చేస్తూ నిర్ణయించింది. హైస్కూల్ ప్లస్ విధానాన్ని ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఫౌండేషనల్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 1:20 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలన్న విద్యావేత్తల డిమాండ్‌ను పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలానే కేటాయింపు చేసింది. ఫౌండేషనల్ స్కూల్‌లో 1:30 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించింది. విద్యార్థుల సంఖ్య 30 దాటితే మరో ఎస్జిటిని కేటాయిస్తామని పేర్కొంది. బేసిక్ ప్రైమరీ స్కూల్‌లో 1:20 అమలు చేస్తామని చెప్పినా విద్యార్ధుల సంఖ్య 60 దాటితేనే మరో పోస్టు ఉంటుందని తెలిపింది. దీంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కూడా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మోడల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉంటే ఐదు తరగతులకు ఒక టీచర్ చొప్పున ఐదుగురిని కేటాయిస్తారు. ఎన్‌రోల్‌మెంట్ 120 కంటే ఎక్కువ ఉంటే ప్రధానోపాధ్యాయ పోస్టు ఉంటుంది. 150 దాటితే ప్రతి 30 మంది విద్యార్ధులకు ఒక ఎస్‌జిటి ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్ధుల సంఖ్య 45-60 మధ్య ఉన్నా మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. సామాజిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా పాఠశాల యాజమాన్య కమిటీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువగా ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలను మోడల్, బేసిక్ ప్రైమరీగా మారుస్తారు. 6,7,8 తరగతుల విద్యార్థులను దగ్గరలో ఉన్న పాఠశాలలకు తరలిస్తారు. 6,7,8 తరగతులు ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 60 కంటే ఎక్కువగా ఉంటే దానిని హైస్కూల్‌గా మారుస్తారు. హైస్కూల్‌లో ఎన్‌రోల్‌మెంట్ 76 కంటే ఎక్కువగా ఉంటేనే హెచ్‌ఎం, పిఇటి పోస్టులు ఉంటాయి. 400 ఎన్‌రోల్‌మెంట్ దాటిన స్కూల్‌కు రెండో పిఇటి, 751 ఎన్‌రోల్‌మెంట్‌కు మూడో పిఇటి పోస్టు ఉంటుంది. పోస్టులు, ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా య్యూజిక్, ఆర్ట్,డ్రాయింగ్, క్రాఫ్ట్ పోస్టులు ఉంటాయి.
స్కూళ్ల ఏర్పాటుకు కమిటీల ఏర్పాటు
గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులలో మోడల్ ప్రైమరీ స్కూల్ గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఉండే కమిటీలో కన్వీనర్‌గా ఎంఇవో-1, కో కన్వీనర్‌గా ఎంఇవో-2 ఉంటారు. సభ్యులుగా సిడిపిఓ-ఐసిడిఎస్, ఎంఆర్‌వోతో పాటు ఎంపిడివో గానీ మున్సిపల్ కమిషనర్ గానీ సభ్యులుగా ఉంటారు. క్లస్టర్ స్థాయి కమిటీలో క్లస్టర్ హెచ్‌ఎం కన్వీనర్‌గా ఎంఇవో-1,2, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సభ్యులుగా ఉంటారు. ఈ రెండు కమిటీలు పాఠశాలల హెచ్‌ఎం, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల ఏర్పాటు గురించి చర్చిస్తారు.
పాత విధానం కొత్త విధానం
1.శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ (పిపి1,పిపి2) (పిపి1,పిపి2)
2.ఫౌండేషన్ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ (పిపిఎ,పిపి2, 1,2 తరగతులు) (పిపిఎ,పిపి2, 1,2 తరగతులు)
3. ఫౌండేషన్ ప్లస్ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ (పిపి1,పిపి2, 1 నుంచి 5వ తరగతి) (పిపి1,పిపి2, 1 నుంచి 5వ తరగతి)
4.ప్రిహైస్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ (3 నుంచి 8వ తరగతి వరకు) (పిపి1,పిపి2 1 నుంచి 5వ తరగతి)
5.హైస్కూల్ హైస్కూల్ (3 నుంచి 10వ తరగతి వరకు) 6 నుంచి 10వ తరగతి వరకు)
6. హైస్కూల్ ప్లస్ — (3 నుంచి 12వ తరగతి వరకు)