లంచాలు అడిగితే ఫిర్యాదు చేయండి

  • రాష్ట్ర సమాచార కమిషన్‌ చీఫ్‌ కమిషనరు ఆర్‌ మహబూబ్‌ బాషా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సమాచార కమిషన్‌లో జరిగే విచారణల్లో తీర్పులు అనుకూలంగా వచ్చేలా చేస్తామని అందుకు డబ్బులివ్వాలని కమిషన్‌ సిబ్బంది ఎవరినైనా ఫోన్ల ద్వారా డిమాండ్‌ చేస్తే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర సమాచార కమిషన్‌ చీఫ్‌ కమిషనరు ఆర్‌ మహబూబ్‌ బాషా కోరారు. 26 జిల్లాల సమాచార హక్కు చట్టం నోడల్‌ అధికారుల (డిఆర్‌ఓలు) సమావేశాన్ని మంగళవారం ఆన్‌లైన్‌లో ఆయన నిర్వహించారు.
కమిషన్‌ కార్యాలయ పనివేళలకు భంగం కలగకుండా ఉదయం 9గంటల నుండి పది గంటల వరకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషన్‌ పేరిట లంచాలు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు జరిగితే తన పేషీ అధికారిక నెంబరు 833380072 కు కానీ, తన ఇ మెయిల్‌కు కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. విచారణకు ప్రత్యక్షంగా హాజరైతేనే అనుకూల ఆదేశాలు వెలువడతాయనే అపోహలు వద్దని, ప్రత్యక్షంగా వచ్చినా, ఆన్‌లైన్‌ విధానంలో హాజరైనా కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తీర్పులు వస్తాయన్నారు. రెండో అప్పీళ్ల ఫిర్యాదులపై జరిగే విచారణలకు పిఇఓ, ఎఫ్‌ఎఎలు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వారు ప్రత్యక్షంగా కమిషన్‌ ముందుకు రావాల్సి ఉంటుంద తెలిపారు. జఠిలమైన కేసుల్లో కమిషన్‌ ఆదేశాల మేరకు రికార్డులతో సహా అధికారులు రావాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ విషయాన్ని సంబంధిత సిబ్బందికి తెలియచేయాలని నోడల్‌ అధికారులను ఆయన ఆదేశించారు. సమాచార హక్కు చట్టం వార్షిక నివేదిక తయారీకి అవసరమైన నివేదికలను జిల్లాల వారీగా అన్ని శాఖల నుంచి పంపేందుకు నోడల్‌ అధికారులు బాధ్యతగా సహకరించాలని మహబూబ్‌బాషా కోరారు. దరఖాస్తుదారులు తెలుగులో సమాచారం ఇవ్వాలని కోరితే ఖచ్చితంగా తెలుగులోనే సమాచారం ఇవ్వాలన్నారు. చట్టంలో నిర్ధేశించిన విధంగా నియమిత కాల వ్యవధిలో (30రోజుల్లోపు) 6(10 దరఖాస్తులకు సమాచారం ఇస్తే వారికి అప్పీలుకు రావాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుందన్నారు. చట్టంలోని కీలకమైన సెక్షన్‌ 4(1) బి కింద ఆయా కార్యాలయాల్లో స్వచ్చందంగా తమ కార్యాలయాల సమాచారాన్ని సాధ్యమైనంతగా వెల్లడిస్తే దరఖాస్తుదారులకు 6(1) కింద దరకాస్తులు చేసుకునే ప్రయాస కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు.

➡️