లీజు ఒప్పంద పత్రాలను నివేదించండి

Ads subject to Supreme Guidelines
  • జీఎంసీకి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి, అమరావతి : గుంటూరు సిటీలోని కొరిటెపాడు కూరగాయల మార్కెట్లో షాపుల్ని ఖాళీ చేయాలంటూ గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీఎంసీ) ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు స్పందించింది. జీఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ చిరు వ్యాపారులు, చేతివత్తుల వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌, ఇతర వ్యాపారులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం విచారించారు. కూరగాయల మార్కెట్లో షాపుల కేటాయింపునకు సంబంధించి అక్కడి చిరు వ్యాపారులతో కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని కోర్టు ముందుంచాలని జీఎంసీని ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరితోనే 25 ఏళ్ల లీజు ఒప్పందం ముగిసిందని చెబుతున్న వాటికి సంబంధించిన లీజు ఒప్పంద పత్రాలను సమర్పించాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేశారు. షాపులను ఖాళీ చేయాలంటూ గత నెల 26న నోటీసులను రద్దు చేయాలని, తుది ఉత్తర్వులు జారీ చేసేలోగా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు. పిటిషనర్లు 2004 నుంచి కొరిటెపాడు లైబ్రరీ సెంటర్‌ రోడ్డు వెంబడి బండ్లపై కూరగాయల అమ్మకాలు జరుపుతున్నారని, జీఎంసీకి పన్ను కూడా కడుతున్నామని చెప్పారు. ఆ తర్వాత కూరగాయల మార్కెట్లో తమకు షాపులకు లీజుకు కేటాయిస్తే సొంత డబ్బుతో నిర్మాణాలు చేసుకున్నారని వివరించారు. 2004%-%05 నుంచి జీఎంసీ ఒక్కో షాపుకు నెలకు రూ.2350 లీజు చెల్లించేలా అగ్రిమెంట్‌ జరిగిందన్నారు. కొంత సొమ్ము వసూలు చేసి షాపులను క్రమబద్ధీకరణకు జీఎంసీ 2009%-%10లో తీర్మానం చేసిందన్నారు. పాతికేళ్లు పూర్తయినందున ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిందని, వాస్తవానికి 25 ఏళ్లు పూర్తి కానప్పటికీ షాపులను ఖాళీ చేయాలని కోరడం అన్యాయమన్నారు. జిఎంసీ అధికారులు నోటీసులు చట్ట బద్ధంగానే ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. లీజు ఒప్పంద పత్రాల పరిశీలన నిమిత్తం విచారణ ఈ నెల 14కి వాయిదా పడింది.

➡️