- చదివి విన్పించిన హోంమంత్రి అనిత
- చర్చకు అంగీకరించని మండలి చైర్మన్
- మండలి నిరవధిక వాయిదా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్‌సి వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించిన నివేదికను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ పలు అంశాలను ప్రస్తావించారు. 1996లో న్యాయమూర్తి రామచంద్రరాజు కమిషన్ నేతత్వంలో ఎస్సీ ఉపకులాలను నాలుగు వర్గాలుగా విభజన చేశారని గుర్తు చశారు. ఈ నేపధ్యంలో గత 30 ఏళ్లకాలంలో జరిగిన పరిణామాలను పరిశీలించి ఇటీవల ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో పర్యటించి వివిధ తరగతుల నుంచి అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. ఏ కేటగిరి కింద రెల్లీ మరియు 12 ఉపకులాలు, బీ కేటగిరిలో మాదిగతో పాటు 18 ఉపకులాలు, సీ కేటగిరి కింద మాల మరియు 25 ఉపకులాలు, డీ కేటగిరి కింద 4 ఆది ఆంధ్ర సహా ఉపకులాలు ఉంటాయని తెలిపారు. కులం, ఆ సమూహం తగిన ప్రాధాన్యం పొందలేకపోవడానికి వెనుకబాటు తనానికి కారణమని పేర్కొన్నారు. ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. వైసిపి నుంచి పలువురు సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నించగా మండలి చైర్మన్ అంగీకరించలేదు. ఎమ్మెల్సీ పండుల రవీంద్రనాథ్ ఈ ప్రతిపాదనలపై ఈ రోజు బ్లాక్ డే అని మాట్లాడేందుకు ప్రయత్నించగా ఎవరు మాట్లాడినా రికార్డుల్లోకి వెళ్లబోవమన్నారు. మాట్లాడనివ్వాలని వైసిపి వారికి అవకాశం ఇవ్వాలని మంత్రులు పయ్యావుల కేశవ్,అనిత తదితరులుకోరినా వారిని పట్టించుకోకుండా చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు