ప్రజాశక్తి-కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ ( నెల్లూరు) : గత మూడేళ్లలో ప్రజలతో మమేకమై ప్రజా రంగాల ద్వారా రాజీలేని విధంగా పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహించినట్లు వివిధ ప్రజారంగాల బాధ్యులు చెప్పారు. సిపిఐ(ఎం) 27వ రాష్ట్ర మహాసభలో ప్రవేశపెట్టిన ప్రజారంగాల నివేదికపై రెండోరోజైన ఆదివారం రంగాల వారీగా చర్చ జరిగింది.
కార్మిక రంగం నుంచి బేబీరాణి, కందారపు మురళి మాట్లాడుతూ 42 రోజుల పాటు జరిగిన అంగన్‌వాడీల సమ్మెతో పాటు మున్సిపల్ కార్మికుల సమ్మెలు జయప్రదమైనట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాలుగేళ్లుగా సాగుతున్న ఆందోళన కార్మికుల పోరాట పటిమకు నిదర్శమన్నారు. విజయనగరం జిల్లా మిమ్స్ కార్మికులు తమ హక్కుల కోసం నిర్బంధాన్ని ఎదురించి పోరాడారని చెప్పారు. నెల్లూరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్లను మార్చడాన్ని ఆపగలిగామని, ధర్మల్ విద్యుత్‌ని అదానీకి అప్పగించాలని చూస్తే అడ్డుకున్నామని చెప్పారు.
వ్యవసాయ కార్మిక రంగం నుంచి శివనాగరాణి, కె ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభానికి గురికావడం, యాంత్రీకరణ పెరిగి పనిదినాలు పడిపోవడంతో అనివార్యంగా భూ పోరాటాలకు, వ్యవసాయ పోరాటాలకు దిగాల్సి వస్తోందన్నారు. ఈ కాలంలో 16 జిల్లాల్లోని 181 కేంద్రాల్లో భూమి, ఇళ్ల స్థలాలు, నిర్వాసితుల సమస్యలపై ఆందోళనలు జరిగాయనీ, 900 మందికి పైగా కేసులు బనాయించారని, రౌడీ షీట్లు పెట్టారని చెప్పారు.
రైతు రంగం నుంచి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు, అస్తవ్యస్తమైన మార్కెట్, పెరిగిన సాగు పెట్టుబడులతో రాష్ట్ర వ్యవసాయం సంక్షోభంలో వుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించమని అడుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. గుంటూరులో పసుపు, ఉత్తరాంధ్రలో చెరుకు పంటల వారీగా చేస్తున్న పోరాటాలకు రైతుల నుంచి స్పందన కనబడుతున్నదన్నారు. యువజన రంగం తరపున జి రామన్న మాట్లాడుతూ నిరుద్యోగం, స్థానిక సమస్యలపై పనిచేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లగలిగామనిó తెలిపారు. మెగా డిఎస్సీపై పోరాటంలో లక్షలాది మంది భాగస్వామ్యులవ్వడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం పెట్టాల్సిన పరిస్థితిని కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యార్థులకు పూర్తిగా విద్యను దూరం చేసేందుకు ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేయడంపై పోరాటాలు చేశామని విద్యార్థి రంగం తరపున ప్రసన్నకుమార్ తెలిపారు. విద్యార్థి ఉద్యమాల్లో సాంస్కృతిక రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళా రంగం తరపున సాయిలక్ష్మీ, శ్యామల మాట్లాడుతూ బాలల రంగం, మైక్రో ఫైనాన్స్, డ్వాక్రా రంగాల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్నామనిó తెలిపారు. బాలలకు ట్యూషన్ సెంటర్లు నిర్వహించడం, తరుణీతరంగాలు పేరుతో మహిళలకు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చినట్లు చెప్పారు. కళారంగం తరపున అనిల్ మాట్లాడుతూ సాంస్కృతిక రంగంలో బిజెపి ప్రమాదం పెరుగుతోందని, అదే మోతాదులో మన సాంస్కృతిక రంగం కూడా పనిచేయాల్సి వుందని తెలిపారు. ప్రజారక్షణ భేరి, పోలవరం పాదయాత్ర వంటి కార్యక్రమాల్లో దళాలు విస్తృతంగా పాల్గొన్నాయని చెప్పారు.
వైసిపి ప్రభుత్వం కౌలు చట్టాన్ని మార్చడంతో అనేకమంది కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కౌలురైతు రంగం తరపున హరిబాబు, లక్ష్మణస్వామి చెప్పారు. దేవాదాయ భూములను సాగుచేస్తున్న కౌలు రైతులకు అనుకూలంగా ప్రభుత్వ ఉత్తర్వులు సాధించడంలో జరిగిన రాయభారాలను, ఆందోళనా వివరాలను వారు వివరించారు. పంటల భీమా, పంటల నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతుల పక్షాన పోరాటాలు చేసినట్లు చెప్పారు.
గిరిజన రంగం తరపున లోతా రామారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిలలోనూ ప్రయత్నం చేస్తున్నామనిó తెలిపారు. జీవో నెంబర్ 3 రద్దుపై ఆందోళన నిర్వహించడం జరిగిందన్నారు. ఏజెన్సీలో స్థానిక గిరిజన యువతకు వందశాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తూ 2000లో వచ్చిన ఈ జీవోను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందితో మన్యం బంద్, రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ ముట్టడి నిరసనలతో గిరిజన రంగం ప్రతిష్ట పెరిగిందని తెలిపారు.
మొత్తం సముద్రతీరాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీనివల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని వృత్తిదార్ల తరపున గంటా శ్రీరామ్, గురు శేఖర్ తెలిపారు. అలాగే చేనేత కార్మికులపై దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం వుందన్నారు.
సామాజిక రంగానికి సంబంధించి క్రాంతికుమార్, రఘురామ్ మాట్లాడుతూ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని చెప్పారు. శ్మశాన వాటికల సమస్యలపై జగన్ ప్రభుత్వ హయాంలో ఆందోళన చేయగా,….ఆయా ప్రాంతాల్లో జనాభాను బట్టి అర ఎకరం నుండి ఎకరం వరకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. పూర్వ ప్రకాశం జిల్లాలో దళితుడిని ఎస్‌ఐ, ఇతర పోలీసులు హింసించిన ఘటనపై 2016లోనే తాము కేసు వేయగా, ఇటీవల ఆ ఎస్‌ఐకి శిక్ష వేయడమేగాక జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని చెప్పారు.
పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గత మూడేళ్లలో శాసన మండలిలోనూ, బయటా అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనకు ప్రత్యక్షంగా సంఘీభావం తెలిపామని, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వంతో రాయభారాలు నడపడమే గాక ఆందోళనలో పాల్గొనడం వల్లే రెగ్యులరైజేషన్ అయిందని చెప్పారు. జాబ్ కేలండర్, డిఎస్‌సి నోటిఫికేషన్ కోసం, వెలుగొండ ప్రాజెక్టు సత్వర పూర్తికి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో ప్రస్తావించామని చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేయడానికి ఈ నెల 27న శాసనమండలిలో ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల స్థానాలకు పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని కోరారు.
తమ ‘బడి కోసం బస్సు యాత్ర’కు ప్రజల్లో స్పందన రావడం వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే తగ్గి పాత పద్దతిని పునరుద్ధరించడానికి ప్రకటన జారీ చేసిందని, అయితే మళ్లీ మరో రూపంలో మరింత ప్రమాదకరంగా తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఉపాధ్యాయ రంగం నుండి పాల్గొన్న సురేష్ చెప్పారు. మతోన్మాదాన్ని పక్కా ప్రణాళికతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గంలోకి మతోన్మాదులు తీసుకెళ్లే ప్రయత్నాన్ని తిప్పికొట్టేలా కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
సైన్స్ రంగానికి సంబంధించి రామారావు, త్రిమూర్తులు రెడ్డి మాట్లాడుతూ 8 వేల పాఠశాలల్లో చెకుముకి సంబరాలు నిర్వహించామని చెప్పారు. మేజిక్‌పై రాష్ట్ర వర్క్‌షాపులో తీసుకున్న 50 మంది ద్వారా రాష్ట్రమంతా మేజిక్ షోలను మరింత పకడ్బందీగా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
న్యాయవాద రంగానికి సంబంధించి మాధవరావు, పౌర హక్కులకు సంబంధించి రమేష్ మాట్లాడుతూ
పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ప్రతి సందర్భంలోనూ బాధితులకు అనుకూలంగా తీర్పులు రావడం లేదన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాను ఉపా చట్టం కింద జైలులో దశాబ్దానికిపైగా నిర్బంధించి మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని, 80 ఏళ్ల వృద్ధుడు స్టాన్‌స్వామి అక్రమంగా జైలులోనే నిర్బంధించడంతో అనారోగ్యానికి గురై చనిపోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
న్యాయవాదుల రంగం ప్రతినిధి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం న్యాయస్థానాల్లోనూ మతతత్వాన్ని చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఆ పార్టీకి ఊడిగం చేసే వారికే ఉద్యోగోన్నతులు కల్పిస్తోందన్నారు. సామాజిక కార్యకర్త సాయిబాబా వంటి వారిని జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు.
సోషల్ మీడియా రంగం ప్రతినిధి దాస్ మాట్లాడుతూ సాంకేతికంగా వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్లో భాగంగా యువత తప్పుదోవపట్టే పరిస్థితులున్నాయని అన్నారు. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు సోషల్ మీడియా ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారు.
నెల్లూరు ప్రజా వైద్యశాల ప్రతినిధి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. సహకార ఉత్పత్తి రంగాలను మెరుగుపరచుకోవడం ద్వారా ప్రజా సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
పట్టణ సంస్కరణలపై సత్యబాబు మాట్లాడుతూ కేంద్రం ఒత్తిడితో పట్టణాల్లో చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్ను వంటివి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుండటం పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందన్నారు. భవిష్యత్తులో వీటిపై పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు.
సాహితీరంగ ప్రతినిధి సత్యాజీ మాట్లాడుతూ పుస్తకాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతిశీల సాహిత్యాన్ని అందించాల్సిన అవసరముందన్నారు. సాహిత్య కార్యశాలలు, జనకవనం వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సి ఉందని అన్నారు.
మైనార్టీ రంగం నుంచి ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎ చిష్టి మాట్లాడుతూ లౌకికవాదం ప్రాతిపదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మణిపూర్‌లో, బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులను ఖండించామని అన్నారు.
విజ్ఞాన కేంద్రాల నిర్వాహకుల ప్రతినిధి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 16 జిల్లాలో విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో వైజ్ఞానిక అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలకు మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు, సాహితీ వేత్తల నుంచి మంచి స్పందన లభిస్తుందని వివరించారు.
ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక ప్రతినిధి రెడ్డి వేణు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకపోవడం వల్ల ఉత్తరాంధ్ర అన్ని విధాల నష్టపోయిందని అన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్ వంటి విషయాల్లో బిజెపి మోసం చేసిందని విమర్శించారు.
రాయలసీమ అభివృద్ధి వేదిక ప్రతినిధి డాక్టర్ ఎం.గేయానంద్ మాట్లాడుతూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ప్రజల సెంటిమెంట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్‌ను కడపలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
రాజధాని అభివృద్ధి వేదిక ప్రతినిధి ఎం.రవి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో బిజెపి మోసాన్ని రైతులు క్రమేణా తెలుసుకున్నారని అన్నారు. రాజధాని ప్రాంత అభివద్ధి విషయంలో 29 గ్రామాలకు పరిమితం చేయకుండా సిఆర్‌డిఎ పరిధిలోని 56 మండలాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధి నాగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల విషయంలో షరతులు విధిస్తోందని అన్నారు. అర్హులకు అన్యాయం చేస్తే పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బాలల సంఘం ప్రతినిధి జయ మాట్లాడుతూ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన నివాస ప్రాంతాల్లో 132 చిల్డన్స్ క్లబ్‌లు నడుస్తున్నాయని చెప్పారు. విశాఖలో ట్యూషన్ సెంటర్లు కూడా నడుస్తున్నాయన్నారు. మిగిలిన చోట్ల కూడా క్లబ్‌లు నడుపుతామని అన్నారు.
ప్రజారోగ్య వేదిక ప్రతినిధి కామేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యం ప్రజల హక్కుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫీజులు, వైద్య పరీక్షల బిల్లులు, పడకలు వంటి వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్టీ ప్రజాప్రతినిధుల విభాగం నుంచి టి.కృష్ణమోహన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల నిధులు, విధులు, అధికారాలు తెలుసుకొని ప్రజలకు సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇంకా, అఖిల భారత శాంతి సంఘం ప్రతినిధి సతీష్, టెక్నాలజీ రంగ ప్రతినిధి శ్రీపతి, జానపద, వృత్తి కళాకారుల రంగాల ప్రతినిధులు మాట్లాడారు.