- అనేక పోషకాలు- డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఔషధం
- నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ పివి కృష్ణకు పేటెంట్
ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) : గోదావరిలో లభించే పులస చేపలో ఉండే పోషక పదార్థాలపై చేసిన పరిశోధనలకుగానూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పి.వి.కృష్ణ పేటెంట్ హక్కు లభించింది. ఈ మేరకు చెన్నైలోని భారత ప్రభుత్వ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పేటెంట్ కార్యాలయం నుంచి ఆయనకు ధ్రువపత్రం అందింది. ఈ సందర్భంగా వర్సిటీలో పి.వి కృష్ణను ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు సన్మానం చేశారు. ఇటువంటి పరిశోధనలు నిరంతరం కొనసాగించి యూనివర్సిటీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఉపకులపతి కోరారు. కృష్ణ మాట్లాడుతూ.. పులస చేపలో ప్రొటీన్లు, సాచ్యూరేటెడ్, అన్సాచ్యూరేటెడ్ ఆమ్లాలతో అతి ముఖ్యమైన డోకోసహెక్సయినోయిక్ (డిహెచ్‌ఎ), ఐకోసపెంటయీనోయిక్ (ఇపిఎ) ఆమ్లాల మీద పరిశోధన చేసినట్లు తెలిపారు. పులస చేప బంగాళాఖాతం నుంచి గౌతమి, వశిష్ట పాయల ద్వారా గోదావరిలో ప్రవేశించి ధవళేశ్వరం చేరుకుంటుందన్నారు. ఇక్కడ ఈ చేప తన రంగు మార్చుకుని తెల్లగా ప్రకాశిస్తుందని, తరువాత అనేక పోషక విలువలతో కూడిన మార్పులు చెందుతుందని తెలిపారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఈ చేప ఒక ఔషధంగా పనిచేస్తుందని, ఎలుకల మీద చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాలుష్యం వల్ల గోదావరి నది ముఖద్వారంలో వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని, ఇన్ని ఔషధ గుణాలున్న ఈ చేపను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఆచార్య కె రత్న షీలామణి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా 130 దేశ, విదేశీ జర్నల్స్‌లో పివి కృష్ణ పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. ఆయన పర్యవేక్షణలో ఆక్వా, ఫిషరీసైన్స్ మీద పరిశోధన చేసిన 33 మంది విద్యార్థులు పిహెచ్‌డి పూర్తి చేశారు.