పిన్నెల్లి కేసు వాదనలు పూర్తి.. నేడు తీర్పు

ప్రజాశక్తి-అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును మంగళవారం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు. కౌంటింగు పూర్తయ్యే వరకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని పిటిషనర్‌ పిన్నెల్లి, బెయిల్‌ ఇస్తే కౌంటింగు నాడు అల్లర్లకు పాల్పడే ప్రమాదం ఉన్నందున బెయిల్‌ ఇవ్వరాదని పోలీసులు, బాధితులు ప్రతివాదన చేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును మంగళవారం వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
తొలుత పిన్నెల్లి తరపున సీనియర్‌ న్యాయవాది టి నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, ఓట్ల లెక్కింపు అయ్యే వరకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలింగు ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని, పోలీసులు అరెస్టు చేస్తే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని చెప్పారు. ఇప్పటికే ఇవిఎంల కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయకుండా ఇదే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా పోలీసులు అక్రమంగా నమోదు చేసిన హత్యాయత్నం, ఇతర కేసుల్లో తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఏ విధమైన షరతులు విధించినా అమలు చేసేందుకు పిటిషనరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగ శిరోమణి తరపున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసి వాదించారు. బెయిల్‌ ఇస్తే పోలింగ్‌ రోజు మాదిరిగానే కౌటింగ్‌ రోజున కూడా దౌర్జన్యాలకు పాల్పడే అవకా శాలు ఉన్నాయన్నారు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేలా ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.

➡️