ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : వైసిపి క్రియాశీల సభ్యత్వానికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎ రెహమాన్ రాజీనామా చేశారు. విశాఖపట్నం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ విషయాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిముల సంక్షేమానికి పెద్దపేట వేస్తానని చెప్పడంతో స్థానిక ముస్లిము నేతల కోరికతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైనారిటీ శాఖ మంత్రి ఫరూఖ్ వచ్చే నెలలో విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడతానని, ముఖ్యంగా స్థానిక ముస్లిము పెద్దల అభిప్రాయం తీసుకొని ఏ పార్టీలో చేరాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ముస్లిముల ప్రయోజనాలను ఏమాత్రమూ పరిరక్షించలేకపోయిందని, వక్ఫ్ ఆస్తుల రక్షణలో విఫలమైందని విమర్శించారు. ముస్లిముల సమస్యలను పలుసార్లు వైసిపి ముఖ్య నేతలకు నివేదించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు.
