పుస్తక ప్రదర్శనకు స్పందన

ప్రజాశక్తి- నెల్లూరు : సిపిఎం రాష్ట్ర మహాసభ నేపథ్యంలో నెల్లూరులోని విఆర్‌సిలో జనవరి 28 నుంచి జరుగుతోన్న సింహపురి పుస్తక ప్రదర్శనకు శుక్రవారం విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో తరలొచ్చారు. విజయవాడ బుక్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ పుస్తక ప్రదర్శనను పుస్తక ప్రియులందరూ ఉపయోగించుకోవాలని విజయవాడ బుక్‌ సొసైటీ అధ్యక్షులు కె.లక్ష్మయ్య కోరారు. ఆరుద్ర సాహిత్య వేదికపై కామ్రేడ్‌ జక్కా వెంకయ్య ‘ఉద్యమాపథంలో నేను’ పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, అమరవీరులు పోరాట యోధుల పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్టీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ పేదలు, కార్మికులు, కర్షకుల పక్షానే పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు..

ఆకట్టుకున్న జెవివి ప్రదర్శనలు, మేజిక్‌ షో

ప్రజల్లో సైన్స్‌ దృక్పథం పెంచడానికి జనవిజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు, మేజిక్‌ షో ఆకట్టుకున్నాయి. బురిడీ బాబాల గురించి వివరించారు. జెవివి సభ్యులు గాజు పెంకులపై నడిచి చూపించారు. ఇందులోని సైన్స్‌ కోణాన్ని విశదీకరించారు. ఒక మహిళ తన చంటి బిడ్డతో గాజు పెంకులపై నడిచి అకట్టుకున్నారు. బాబాలు చేసే ఎన్నో మోసపూరిత గారడీల వెనుక కేవలం సైన్స్‌ మాత్రమే ఉంటుందని జెవివి సభ్యులు విపులంగా విరించారు. ప్రజలు అలాంటి గారడీలు నమ్మి మోసపోవద్దని కోరారు. అనంతరం మేజిక్‌ షో నిర్వహించారు. ఇందులో కూల్‌ డ్రింక్స్‌, ఫైర్‌, తాడు ట్రిక్స్‌ ప్రదర్శించడంతోపాటు విజ్ఞానదాయక పాటలు పాడి ప్రజల్లో సైన్స్‌ చైతన్యాన్ని కలిగించారు.

➡️