సిఎం పర్యటనలో ఆంక్షలు

Oct 1,2024 07:40 #CM visit, #Kurnool, #restrictions
  • పార్టీలు, సంఘాలపై నిఘా
  • అనుమతి కోరిన ఎస్‌పి
  • జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా

ప్రజాశక్తి – అమరావతి : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు (మంగళవారం) పర్యటించనున్న సందర్భంగా ప్రజానీకంపై అధికారయంత్రాంగం అనేక ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే డ్వాక్రా సంఘాల మహిళలు, ఆర్‌పిలు, ఆఫీసు బేరర్లు ఎటువంటి ప్రదర్శనలు నిర్వహించకుండా చూడాలని సెర్ప్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. వివిధ ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఈ తరహా ఉత్తర్వులు అందుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివిధ పార్టీలు, సంఘాలు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశంఉందని జిల్లా ఎస్‌పి, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇలా సమస్యలను తీసుకువెళ్లే వారి జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎస్‌పి చేర్చడం విశేషం. సిపిఎస్‌తో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వ ఉద్యోగులు సిఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని ఎస్‌పి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. వామపక్షాలు వాటి అనుబంధ సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు వైసిపి, మరికొన్ని కులసంఘాలు ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశం ఉందని కలెక్టర్‌ దృష్టికి జిల్లా ఎస్‌పి తీసుకువెళ్లినట్లు సమాచారం. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు అమర్చడం, ఆర్‌టిసి బస్సు ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలతో పాటు రాయల సీమకు సంబంధించిన వివిధ సమస్యలపై వారు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందచేయడంతో పాటు, నినాదాలు చేసే అవకాశం ఉన్నందున వారి కదలికలపై నిఘా పెట్టడంతో పాటు, ఇతర చర్యలు చేపట్టేందుకు అనుమతివ్వాలని కలెక్టర్‌ను ఎస్‌పి కోరినట్లు తెలిసింది.

➡️