సిఐడి రిటైర్డు అధికారి విజయపాల్‌ అరెస్టు

  • రఘురామకృష్ణంరాజు కేసులో విచారణ

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : సిఐడి రిటైర్డు అధికారి విజయపాల్‌ను ఒంగోలు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అప్పటి ఎంపి, ప్రస్తుత డిప్యూటి స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్‌ టార్చర్‌ చేసినట్లు నమోదైన కేసులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న సిఐడి రిటైర్డు అధికారి విజయపాల్‌ను ఒంగోలులో ప్రత్యేక విచారణ అధికారి, జిల్లా ఎస్‌పి దామోదర్‌ విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారణ కొనసాగింది. అప్పట్లో ఎంపిగా ఉన్న రఘురామకృష్ణంరాజును గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో అరెస్టు చేసి మంగళగిరి తరలించారు. అప్పట్లో సిఐడి ఎఎస్‌పిగా విజయాపాల్‌ ఉన్నారు. ఆయనతో పాటు మాజీ సిఎం వైఎస్‌ జగన్‌, నాటి సిఐడి అదనపు డిజి సునీల్‌కుమార్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, గుంటూరు జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిపై రఘురామకృష్ణంరాజు ఇటీవలే గుంటూరు నగరపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో హింసించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో ఆయన కాళ్లు బాగా వాచిపోయిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణకు ప్రకాశం జిల్లా ఎస్‌పి దామోదర్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించింది. దీంతో తొలుత సిఐడి రిటైర్డు అధికారి గతంలోనే ఒకసారి విచారణ చేశారు. మలిదశలో ఆయనను పలు కోణాల్లో రహస్యంగా ఎస్‌పి విచారణ జరిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు విజయపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మీడియానూ ఎస్‌పి కార్యాలయంలోని అనుమతించలేదు. మిగతా వారిని కూడా ఎస్‌పి విచారించనున్నారు.

➡️