ప్రభుత్వ ఆధీనంలోకి హయగ్రీవ భూములు

  • హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖలోని ఎండాడ కొండపై హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు 12.51 ఎకరాల భూ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న రద్దు చేసిన నేపథ్యంలో ఆ భూముల్లో విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో హెచ్చరిక బోర్డులు పెట్టించారు. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ ఆర్‌పి సిసోడియా నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ ఈ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు రకాల వసతులతో వృద్ధుల ఆశ్రమానికి 12.51 ఎకరాల్లో నిర్మాణాలు చేసేందుకుగానూ ఇక్కడ 2008లో అనుమతులు లభించాయి. అయితే వృద్ధుల ఆశ్రమం కోసం కాకుండా గత వైసిపి ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపి ఎంవివి.సత్యనారాయణ, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జివి) తదితరులు తమ స్వప్రయోజనాల కోసం ఈ భూముల్లో ఫ్లాట్లు నిర్మించి అమ్మకాలు సాగించారన్నది ప్రధాన ఆరోపణ. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొత్తంగా ఈ కేటాయింపులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ భూముల్లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

➡️