నూతన మద్యం విధానాన్ని సవరించండి

  • షాపుల సమయాన్ని కుదించండి
  • మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నూతన మద్యం విధానాన్ని సవరించాలని, మద్యం షాపులు తెరిచి ఉంచే సమయాన్ని కుదించాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో బుధవారం మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా ఎంచుకోవడం హేయమని ఈ సందర్భంగా వివిధ మహిళా సంఘాల నేతలు అన్నారు. ఎన్‌ఎఫ్‌డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మద్యం వల్ల ప్రతి నిత్యం మహిళల మీద అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నట్లు నేషనల్‌ క్రైం బ్యూరో రిపోర్టు వెల్లడిస్తోందన్నారు. గుజరాత్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, బీహార్‌ల్లో కూడా మద్యపాన నిషేదం అమల్లో ఉందన్నారు. రాష్ట్రంలో కూడా మహిళా సంఘాల అభిప్రాయాలు తెలుసుకుని ఆ దిశలో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బార్‌లు నడపాలన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు, వ్యక్తులకు వీటిని అప్పజెప్పడంతో నియంత్రణ లేకుండా పోతుందన్నారు. వారానికి ఒక్క రోజైనా డ్రై డేగా నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పిహెచ్‌సి సెంటర్లలో డి-ఎడిక్షన్‌ సెంటర్లు పెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ మేయరు, వైసిపి నాయకులు రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తామని మహిళలకు అండగా ఉంటామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిందన్నారు. నేడు ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులకు షాపుల ఇవ్వడం వల్ల 15వేలమంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ విచ్చలవిడిగా సిండికేట్‌ ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల క్రైమ్‌ రేటు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతు సంఘం నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ మద్యపానం నియంత్రించకపోతే మహిళలకు భద్రత ఉండదన్నారు. విద్యార్ధుల మీద వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్నారు. కుటుంబాలు ఆర్ధికంగా క్షీణిస్తున్నాయన్నారు. మద్యాన్ని కట్టుదిట్టంగా నియంత్రణ చేయాలని సిఎంను కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. సమతా పార్టీ నాయకులు కృష్ణారావు మాట్లాడుతూ మద్యం వల్ల పిల్లలు, మహిళలు , తర్వాత సమాజం పాడవుతుందన్నారు.
మద్యం మహమ్మారితో అనేక చోట్ల తల్లి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటుందంటే సమాజం ఎటువైపు పోతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేదం వల్ల బీహార్‌లో ఆదాయం తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అక్కినేని వనజ, పిఓడబ్ల్యు నాయకులు పద్మ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శిశ్రీదేవి, ప్రజానాట్యమండలి నాయకులు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు సుబ్బారావు, డివైఎఫ్‌ఐ నాయకులు రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్‌, ఎవైఎఫ్‌ఐ నాయకులు లంకా గోవిందరాజులు, సిపిఐ నగర సహాయ కార్యదర్శినక్కా వీరభద్రారావు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️