వ్యవస్థీకృత నేరంగా బియ్యం అక్రమ రవాణా

  • కాకినాడ పోర్టు భద్రతకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసరు
  • మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌తో కూడిన మంత్రివర్గ ఉప సంఘం భేటీ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసరును నియమించాలని నిర్ణయించింది. పిడిఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. స్థానికంగా పోర్టులోని ఐదు వేర్‌ హౌస్‌లలో సార్టెక్స్‌ మిషన్‌ల అంశంపై కూడా చర్చించారు. వేర్‌ హౌస్‌లలో యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్‌ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్‌ యంత్రాల ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిజి, శాంతి భద్రతల ఐజి, సివిల్‌ సప్లైస్‌శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి, మారిటైమ్‌ బోర్డు సిఇఒ, కస్టమ్స్‌, కాకినాడ పోర్టు అధికారులు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️