రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత

  • ప్రాసిక్యూషన్‌ నేరం నిరూపించలేకపోయింది : జడ్జి నీలిమ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు సహచర విద్యార్థుల ర్యాంగింగ్‌, లైంగిక వేధింపులే కారణమంటూ 2015లో నమోదైన కేసులో నిందితులపై మోపిన అభియోగాలు సరికాదని గుంటూరు జిల్లా అదనపు న్యాయమూర్తి కె.నీలిమ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ నేరం రుజువు చేయలేకపోయినందున కేసు కొట్టివేసినట్టు వెల్లడించారు. ర్యాగింగ్‌, లైంగిక వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు 2015 జులై 15న రిషితేశ్వరి తన సూసైడ్‌ నోట్‌లోనూ, డైరీలోనూ పేర్కొన్నారు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్య అప్పట్లో మన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఫిర్యాదు చేసినా సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆరోపణలు రావడంతో ప్రిన్సిపాల్‌ బాబూరావును కూడా పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ప్రధాన నిందితులుగా సహ విద్యార్థులు నాగసాయి లక్ష్మి, చరణ్‌, నరాల శ్రీనివాస్‌లను పేర్కొన్నారు. వారినీ అప్పట్లో అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. నేరం రుజువు కాలేకపోవడం వల్ల కేసు కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. తీర్పు తర్వాత ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.కోటేశ్వరరావు మాట్లాడుతూ రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయన్నారు. తాను ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీల్లో ఆమె రాసుకుందని తెలిపారు. అవన్నీ కోర్టు ముందుంచామన్నారు. హారుల్యాండ్‌లో ప్రెషర్స్‌ పార్టీలో లైంగికంగా వేధించారన్నారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడుతుందని భావించామని, కానీ తీర్పు భిన్నంగా రావడంతో పైకోర్టుకు అప్పీలుకు వెళ్లాలని కోరతానని తెలిపారు. ప్రధాన నిందితుల తరపు న్యాయవాది మహతి శంకర్‌ మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం కేసును సెన్సేషన్‌ చేశారని, నేరం రుజువు చేయలేకపోయారని పేర్కొన్నారు. రిషితేశ్వరి చనిపోయినంత వరకు నూకరాజు, జితేంద్ర వేధించారని, వారి పేర్లను తొలగించి… మెరిట్‌ స్టూడెంట్లను ఇరికించారని అన్నారు.

న్యాయం జరగలేదు : రిషితేశ్వరి కుటుంబ సభ్యుల ఆవేదన

కోర్టు తీర్పుపై రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ తాము తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామని తెలిపారు. అయితే, న్యాయం జరగలేదన్నారు. రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఆమె డైరీల్లో అన్ని వివరాలూ ఉన్నాయని వివరించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా రిషితేశ్వరే డైరీ రాసినట్లు నివేదిక ఇచ్చిందన్నారు.

➡️