ప్రజాశక్తి – పోలవరం : కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న గోదావరి జలాలను ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 26.580 మీటర్లు, స్పిల్‌వే దిగువన 16.610 మీటర్లు, కాపర్ డ్యాంకి ఎగువన 26.650 మీటర్లు, కాపర్ డ్యాంకి దిగువన 15.490 మీటర్లు నీటిమట్టం నమోదైనట్లు ఇఇలు పి.వెంకటరమణ, మల్లిఖార్జునరావు తెలిపారు.
6.018 వేల క్యూసెక్కుల జలాలు విడుదల
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 6.018 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్దిరాజు మంగళవారం తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 14.802 మీటర్లకు చేరుకుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 17 పంపులు 17 మోటార్లతో నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 2.4060 టిఎంసిల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.