- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో మంత్రి లోకేష్
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలో నెంబర్ 1 అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు రాష్ట్ర విద్య, ఐటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తరాంధ్రను అతిపెద్ద ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. బుధవారం విశాఖలోని నోవటల్ హోటల్‌లో భారత పారిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యాన జరిగిన ఎపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ పెట్టుబడిదారులంతా చంద్రబాబు 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బలంగా భావించారని అన్నారు. 2019-2024 మధ్య కాలంలో బయటకుపోయిన వారంతా ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఐటి, పారిశ్రామిక పాలసీని రూపొందించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విశాఖకు ఎప్పుడూ తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మరిన్ని పెట్టుబడులు విశాఖకు రానున్నాయని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమన్నారు. రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇడిబి)ను ఏర్పాటు చేసి శాఖల ప్రగతిని సమీక్షిస్తామని, సిఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఇది నడుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో సాధించనున్న ప్రగతిని వివరించారు. గోదావరి జిల్లాల్లో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్ కారిడార్ గోదావరి ప్రాంతంలో రాబోతుందని తెలిపారు. విద్యుదుత్పత్తి 72 గిగావాట్లు సాధించాలన్న లక్ష్యంతో హైడ్రో, విండ్, సోలార్ ప్రాజెక్టులను రాష్ట్రమంతటా నెలకొల్పుతామన్నారు. సమ్మిట్‌కు రాష్ట్ర ఆర్ అండ్ బి,మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి జనార్ధన్‌రెడ్డి, సిఐఐ ఎపి శాఖ చైౖర్మన్ వి.మురళీకృష్ణ, జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ జిబిఎస్.రాజు అతిథులుగా పాల్గొన్నారు. ఓపెన్ సెషన్ అనంతరం పెట్టుబడిదారులతోనూ లోకేష్ భేటీ అయ్యారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చే లేదు
‘వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేం మొదటి నుంచీ మాట్లాడుతున్నాం. ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చేలేదు. వైసిపి హయాంలో ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు దుష్ప్రచారం సాగిస్తున్నారు’ అని లోకేష్ అన్నారు. ఎపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇంకెక్కడ ఉక్కు ప్రైవేటీకరణ, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని ప్రకటించేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. అసలు ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ ఎక్కడుంది?’ అని చెప్పుకొచ్చారు. కేంద్రం ఇటీవల రూ.500 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చిందన్నారు. జగన్ హయాంలో ఒక్క రూపాయి అయినా స్టీల్‌ప్లాంట్‌కు వచ్చిందా? అని ప్రశ్నించారు. రాబోయే వంద రోజుల్లో ఐటి పాలసీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని, అదానీ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాగల ఐదేళ్లలో 20 వేల ఉద్యోగాలు విశాఖలో కల్పించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలపై త్వరలో క్షేత్రస్థాయిలో తాను పారిశ్రామికవేత్తలతో పర్యటనలకు వెళ్లనున్నట్లు తెలిపారు.