రోడ్లు, డ్రెయినేజీల్లేక ఇబ్బందులు పడుతున్నాం

Mar 12,2025 22:51 #cpm, #Praja Chaitanya Yatra
  • ప్రజా చైతన్య యాత్రల్లో వెల్లువెత్తుతున్న సమస్యలు

ప్రజాశక్తి-యంత్రాంగం : ‘మంచినీటి సౌకర్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ, సిసి రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. శ్మశాన వాటిక లేకపోవడంతో మరణించిన వారిని ఖననం చేయడం పెద్ద సమస్యగా మారింది’. అంటూ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగాయి. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల ముందు టిడిపి కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి, గరుడాపురం, శెట్టూరు మండలం యాటకల్లు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌ ఆధ్వర్యంలో పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే కూలీలకు చెల్లించాలని రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప పర్యటించారు. గ్రామంలో దళితులకు శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట, జామి మండలాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజల పలు సమస్యలను సిపిఎం నేతల దృష్టికి తీసుకొచ్చారు. పెందుర్తి నుంచి బొడ్డవర వరకు నాలుగు లైన్ల రహదారిగా విస్తరించబోతున్న 516 బి జాతీయ రహదారికి రెండు చోట్ల బైపాస్‌ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ రహదారిలో 33 ఎకరాల భూమిని కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే అదే భూముల్లో నుంచి పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి సర్వేలు చేపట్టారని, ఉన్న కాస్తంత భూమిని సైతం ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలని చూస్తోందని తెలిపారు. దీనిపై తమ్మినేని స్పందిస్తూ భూములను కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఐదు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి తాహశీల్దార్‌కు వినతి అందజేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కొలి ్ల గంగునాయుడు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. విశాఖ నగరంలోని దుర్గానగర్‌, కాకరలోవ, స్వతంత్రనగర్‌, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించారు. స్వతంత్ర నగర్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, అల్లూరి జిల్లా కూనవరం, జికె.వీధి, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో యాత్రలు నిర్వహించారు. డుంబ్రిగుడ మండలం టిక్కిలిబెడ్డలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులు సాగు చేస్తున్న మిరియాల పంటకు కిలోకు రూ.1000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ద్వారా గృహాలు మంజూరైన వారికి రూ.10 లక్షలు చెల్లించాలని కోరారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, దేవరపల్లిలో సిపిఎం బృందం పర్యటించింది. పలువురు స్థానికులు వారికి సమస్యలను ఏకరువు పెట్టారు. దేవరపల్లిలో తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో స్మార్ట్‌ మీటర్లపై పలువురు వ్యాపారులు వినతిపత్రాలు అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు, గణపవరం, అత్తిలి, పెనుమంట్ర మండలాల్లో సిపిఎం బృందం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ పేద కుటుంబాలు నివాసముంటున్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను నేతలకు వివరించారు. రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సౌకర్యం లేదని వాపాయారు. శ్మశాన వాటిక లేకపోవడంతో మరణించిన వారిని ఖననం చేయడం సమస్యగా మారిందని తెలిపారు. మున్సిపాలిటీలో ప్రతి ఇంటింటికీ సాగర్‌ జలాలను కుళాయిల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. నేటికీ పూరిపాకల్లోనే నివాసం ఉంటున్నామని పామూరులోని గణేష్‌నగర్‌, ఎస్‌టి కాలనీ వాసులు తెలిపారు. అందరికీ కాలనీలు మంజూరు చేయాలని, ప్రభుత్వమే కాలనీలు కట్టించాలని కోరారు.

➡️