- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు
విజయవాడ: విజయవాడలో కొండ చరియలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. మొగల్రాజపురం, సున్నబట్టిల సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడిన సంఘటనా స్థలాలను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం ఘటనలో మృతి చెందిన , తీవ్రంగా గాయపడిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో రెండు లక్షల మంది పైగా ప్రజలు కొండ ప్రాంతాల్లో జీవిస్తున్నారన్నారు. గత పది సంవత్సరాల్లో కొండ ప్రాంతాల్లో ప్రమాదాల్లో 20 మందికి పైగా మృతి చెందారని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సర్వే చేసి ప్రమాదాల సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో తక్షణమే సహాయ చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడలోని కొండ ప్రాంతాల్లో రక్షణ చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు తక్షణమే 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్నారు. అవసరమైనచోట్ల రక్షణ గోడలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుగానే వాటిని తొలగించాలని కోరారు. నైపుణ్యం కలిగిన ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు తక్షణమే చేరుకునే ఏర్పాట్లు చేయాలని కోరారు.అనంతరం జిల్లా కలెక్టర్ సృజనకు ఫోన్ ద్వారా బాధితుల సమస్యలను వివరించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతోపాటుగా మెరుగైన వైద్యం చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఘటన స్థలిని సందర్శించిన వారిలో సిపిఎం నేతలు పి.కృష్ణ, మురహరి, క్రాంతి తదితరులు ఉన్నారు.