- ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సిపిఎం ధర్నా
ప్రజాశక్తి – మార్కాపురం : ప్రస్తుత బడ్జెట్‌లో వెలిగొండకు కేటాయించిన నిధులతో ప్రాజెక్టు పూర్తి కాదని, బడ్జెట్‌ను సవరించి రూ.రెండువేల కోట్లు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. దీంతో పాటు మెడికల్ కళాశాలను పూర్తి చేయాలని, మార్కాపురాన్ని జిల్లా చేయాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాయలం ఎదుట గురువారం ఆందోళన చేశారు. అనంతరం కోర్టు కూడలిలో రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో విరమింపజేసేందుకు సిపిఎం నాయకులను రహదారిపై నుంచి పోలీసులు పక్కకు లాగేసే క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు మాట్లాడుతూ.. వెలిగొండ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. నాలుగేళ్ల క్రితం ప్రకటించిన రూ. 12.50 లక్షల ప్యాకేజీ అప్పటి ధరలకు ఆ ప్యాకేజీ తక్కువేనని, ప్రస్తుత ధరలు, పెరిగిన విలువను బట్టి రూ. 20 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ప్యాకేజీలో అర్హులుగా చేర్చాలన్నారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. మొదటి సొరంగంలోని చిన్నచిన్న పనులు పూర్తి చేసి 2026లో నీటిని విడుదల చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి సోమయ్య అధ్యక్షత వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డికెఎం.రఫి, మార్కాపురం మండల కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య తదితరులు పాల్గొన్నారు.