– ఎసిబి వలలో ఏలూరు త్రీటౌన్ సిఐ, కానిస్టేబుళ్లు
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ :41ఎ నోటీస్ కోసం రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన సంఘటనలో ఏలూరు మూడో పట్టణ సిఐ యు.వెంకటేశ్వరరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎసిబి అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎసిబి డిఎస్‌పి సుబ్బరాజు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు..పలువురికి ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన రైల్వే శాఖలో ట్రాక్ మెయింటినెన్స్ విభాగంలో పనిచేస్తున్న విక్టర్‌బాబుపై ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో 41ఎ నోటీస్ ఇచ్చేందుకు విక్టర్‌బాబు నుంచి సిఐ వెంకటేశ్వరరావు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ నగదును ఆయన నేరుగా కాకుండా కానిస్టేబుల్ రాజేంద్ర, ఇస్సాక్‌ల ద్వారా అందించాలని విక్టర్‌బాబుకు ఫోన్‌లో తెలిపారు. విక్టర్‌బాబు ఈ విషయాన్ని రికార్డ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం రాత్రి రూ.50 వేల నగదును మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఇస్సాక్‌కు విక్టర్‌బాబు ఇస్తున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి ఇస్సాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహరంలో సిఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ రాజేంద్ర పాత్ర ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. సిఐని, ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి రాజమండ్రి ఎసిబి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎసిబి డిఎస్‌పి సుబ్బరాజు తెలిపారు.
