మే 20న ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికుల సమ్మె : ఎస్‌డబ్ల్యూఎఫ్‌

Apr 16,2025 21:42 #May 20, #RTC employees, #strike, #SWF, #workers

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జాతీయ సమ్మెలో భాగంగా మే 20న కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆర్‌టిసి కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనేలా ఆర్‌టిసి యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందజేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం విజయవాడ బందరు రోడ్డులోని ఎంబివికెలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ సుందరయ్య, గౌరవ అధ్యక్షులు ఎస్‌కె జిలానీ బాషా అధ్యక్షతన జరిగింది. కర్తవ్యాలు, నిర్మాణాలను ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కమిటీ పలు తీర్మానాలు చేసింది. ఆర్‌టిసి కార్మికుల ఉద్యోగ భద్రత కోసం చట్ట, న్యాయ ప్రమాణాలు, యాజమాన్యం అమలు చేయాలని, పనిష్‌మెంట్ల విషయంలో చట్ట ప్రమాణాలు పాటించాలని, డ్రైవర్‌, కండక్టర్ల ఉద్యోగ భద్రతకు తీవ్ర అవరోధంగా ఉన్న జిఓ నెంబరు 70, 71లను రద్దు చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానించింది. 1/2019 సర్క్యులర్‌ ప్రమాణాలను పాటించాలని, ఈ అంశాలపై రాష్ట్ర సదస్సు నిర్వహించి పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించాలని కూడా సమావేశం తీర్మానించింది. ఇపిఎస్‌ ఆప్షన్‌ ఇచ్చిన వారందరికీ గతంలో ఆర్‌టిసిలో ఉన్న సౌకర్యాలన్నింటినీ తక్షణమే పునరుద్ధరించాలని, ఆర్‌టిసిలో గతంలో ఉన్న మెడికల్‌ స్కీములు అమలు చేయాలని కోరారు. స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలని, గ్రాట్యూటీ ఫార్ములాను గతంలో ఉన్న విధంగా చట్ట ప్రమాణాల ప్రకారం మార్చాలని, ఆర్‌టిసి ఉద్యోగులకు తొలగించిన గ్రేడ్‌పేలను పునరుద్ధరించి 2022 పిఆర్‌సిలో చేర్చాలన్నారు. ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ఆర్‌టిసిల పరిస్థితులను వివరించారు. మే 20న జరగనున్న సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి తమ ఫెడరేషన్‌ చేస్తున్న కృషితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఈ సమ్మె రవాణా రంగ కార్మికుల ఐక్యతను చాటి చెబుతుందన్నారు. విద్యుత్‌ బస్సులు నేరుగా ఆర్‌టిసి నిర్వహించాలని, మార్చి 23న చలో పార్లమెంట్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి టి పట్టాభిరామ్‌ దొర పాల్గొన్నారు.

➡️