– ఎస్‌డబ్ల్యుఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎపిఎస్‌ఆర్‌టిసిలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎపిపిటిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యుఎఫ్), ఎంప్లాయీస్ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు మంగళవారం ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె జిలాని బాషా, అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ సుందరయ్య, అయ్యపురెడ్డి, ఎపిఎస్‌ఆర్‌టిసి అవుట్‌సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి తులసీరామ్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జివి నర్సయ్య వేర్వేరుగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రమాద బీమాతోపాటు, రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినపుడు ఇచ్చే మట్టి ఖర్చును రూ.25 వేలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద బీమా నిర్ణయంతో ఆర్‌టిసిలోని 7,300 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు థర్డ్‌పార్టీ విధానంలో వేతనం ఇచ్చే ప్రక్రియను రద్దుపరిచి, ఎపిఎస్‌ఆర్‌టిసినే నేరుగా వేతనాలు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
