ఆర్‌టిజిఎస్‌ సహకారం ముఖ్యం : మంత్రి నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పనితీరులో ఆర్‌టిజిఎస్‌ సహకారం ముఖ్యమైందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను ప్రజలకు ఒక పద్ధతి ప్రకారం అందించడంలో ఇది సహకరిస్తుందన్నారు. సచివాలయంలోని ఆర్‌టిజిఎస్‌ను మంత్రి గురువారం సందర్శించారు. శాఖల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కార్యక్రమాల అమలుకు ఒక నిర్ధిష్టమైన కాలపరిమితి పెట్టుకుని, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఆర్‌టిజిఎస్‌తో అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఇది తన వద్ద ఉన్న డేటా ఆధారంగా విశ్లేషిస్తోందన్నారు. వివిధ శాఖల్లోని అపారమైన డేటా లభ్యమవుతోందని, దీనిని ఒకేచోట అనుసంధానం చేసేందుకు ఆర్‌టిజిఎస్‌ డేటా లేక్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డీప్‌ టెక్‌ సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుని ఈ డేటాను విశ్లేషించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను ప్రభుత్వం అందించడానికి సహకరిస్తుందని చెప్పారు. త్వరలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిజిఎస్‌ సిఇఒ కె.దినేష్‌కుమార్‌, డిప్యూటీ సిఇఒ ఎం.మాధురి తదితరులు పాల్గొన్నారు.

➡️