ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్రాంతి నేపథ్యంలో బస్టాండ్లలో వేచి ఉండే చివరి ప్రయాణికుడు వరకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అధికారులకు ఎపిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు సూచించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ పై అంతస్తు ఎపిఎస్‌ఆర్‌టిసి భవన్‌లో శుక్రవారం ఆయన సంక్రాంతి బస్సుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు చేరుకునే ప్రయాణికులకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్‌లో ఉంటూ సంక్రాంతి రద్దీని పర్యవేక్షిస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) అప్పలరాజుతో ఫోన్‌లో మాట్లాడి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైవర్లు రోడ్డు డివైడింగ్ గమనించి వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే అద్దె బస్సులు, అదనపు ట్రిప్పులు పెంచి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి విజయరత్నం, జిల్లా ప్రజా రవాణా అధికారి దానం పాల్గొన్నారు.