భద్రతకు ప్రాధాన్యత

Aug 29,2024 23:51 #CM review, #Labor Department
  • కార్మికశాఖపై సమీక్షలో సిఎం
  • రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కార్మికశాఖ, పరిశ్రమలు, బాయిలర్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌ శాఖలపై గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల భద్రత విషయంలో రాజీ పడకూడదని అన్నారు. భద్రతా ప్రమాణాలపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ తప్పనిసరని చెప్పారు. తనిఖీలు భద్రతను పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతేకానీ తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురిచేయకూడదని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో హడావుడి చేసి తరువాత భద్రత గురించి పట్టించుకోవడం లేదని, ఇది సబబు కాదని అన్నారు. దీనిపై నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు.
అధికారులు తరచూ తనిఖీలు చేయడంతోపాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమలు ఏర్పడితేనే ఉపాధి లభిస్తుందన్న విషయాన్ని కూడా అధికారులు గుర్తుంచుకోవాలని చెప్పారు. అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు రిజిస్టర్‌ అయ్యాయని, వాటిల్లో 11.78 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి ముగ్గురు కెమికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఉండాలన్నారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్‌ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్‌ చేస్తున్నామని చెప్పారు. .

ఇఎస్‌ఐ ఆస్పత్రులు బలోపేతం
రాష్ట్రంలో ఉన్న నాలుగు ఇఎస్‌ఐ ఆస్పత్రులను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వైద్యుల నియామకంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. పేదలకు అందే సాయంలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం తెలిపారు. ఇఎస్‌ఐకి రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.54 కోట్ల పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలపగా, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రుల్లో సర్వీసులను అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా సేవలను మెరుగుపరిచే విషయంలో కసరత్తు చేయాలని సూచించారు. లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు, మినిమం వేజెస్‌బోర్డు, బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ బోర్డులను యాక్టివేట్‌ చేసి కార్మికుల హక్కులు, సంక్షేమం అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

చంద్రన్నబీమా నిర్వీర్యం
టిడిపి హయాంలో ప్రారంభించిన చంద్రన్నబీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ బీమా కింద 2.50 కోట్ల మంది లబ్దిదారులు ఉండగా గత ప్రభుత్వంలో 1.22 కోట్లకు తగ్గారని చెప్పారు. ఈ పథకం కింద రూ.10 లక్షలు ఇస్తామనే ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్వరలోనే దీన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. కార్మికులకు బీమా అందించేందుకు అవసరమైన చర్యలూ తీసుకుంటామని పేర్కొన్నారు. కార్మికులే కాకుండా ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాల వారికి బీమా అందించేలా పథకాన్ని డిజైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడుతూ 2014 నుండి 2019 మధ్య ఇఎస్‌ఐ వైద్యసేవలు పొందేవారి సంఖ్య ఐదు లక్షల నుండి 11 లక్షలకు పెరిగితే అనంతరం వచ్చిన ప్రభుత్వ తీరుతో సంఖ్య తగ్గిందని సిఎంకు తెలిపారు.

➡️