టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కుట్రదారుడుగా సజ్జల?

Jul 10,2024 00:43 #ofice, #sajalla, #TDP
  • మరో 33 మందిని గుర్తించిన పోలీసులు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఈ ఘటనలో కుట్రదారుడుగా నమోదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న రామకృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసిపి ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాష్‌, మాజీ ఎంపి నందిగం సురేష్‌తోపాటు మరో 58 మందిపై కేసు నమోదు చేశారు. వీరంతా ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై బుధవారం విచారణ చేస్తామని హైకోర్టు వెల్లడించింది. ఈ పిటీషన్లతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను కూడా విచారిస్తామని తెలిపింది. తాజాగా టిడిపి కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరికి చెందిన ఓ పత్రికా విలేకరితోపాటు మరో 33 మందిని బాధ్యులుగా పేర్కొంటూ కేసు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

➡️