హింసకు ఇసినే బాధ్యత వహించాలి : సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్‌కు వారం ముందు అధికారులను రాజకీయ కారణాలతో టిడిపి ఫిర్యాదులు చేయగానే బదిలీ చేసిన జిల్లాల్లోనే ఈ హింస చోటుచేసుకుంటోందని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌.. బిజెపి, టిడిపి ఫిర్యాదులకు అనుగుణంగా పనిచేసిందని విమర్శించారు. పోలింగ్‌కు ముందు అధికారులను మార్చడంతో కొత్తగా వచ్చినవారు జిల్లాపై అవగాహన తెచ్చుకోలేకపోయారని, అందుకే అసాంఘిక శక్తులు విజృంభించాయని తెలిపారు. మొత్తం 29 మంది అధికారులను టిడిపి బదిలీ చేయించిందని విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు చెప్పారని ఏకంగా డిజిపిని కూడా బదిలీ చేయించారని అన్నారు. పోలింగ్‌ ముగిశాక కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని రాజకీయ కక్షతో హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. టిడిపి దాడులు చేస్తున్నా.. పోలీసులు స్పందించకుండా చోద్యం చూశారని విమర్శించారు. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, పల్నాడు, అనంతపురం తదితర ప్రాంతాల్లో పెద్దయెత్తున టిడిపి హింసకు పాల్పడిందన్నారు. ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి దీపక్‌ మిశ్రా.. టిడిపి, బిజెపి నాయకులు ఇచ్చిన విందుకు హాజరుకావడంపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీస్‌ అబ్జర్వర్‌గా ఉండి శాంతి భద్రతలు కాపాడటంలో దీపక్‌ మిశ్రా పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజు మరింత హింసకు టిడిపి కుట్ర చేస్తోందని, ఎన్నికల కమిషన్‌ మేల్కోని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. తక్షణమే రాష్ట్రంలో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️