- చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చేనేత కార్మికులు తయారుచేసే చేనేత వస్త్రాలను ఇ-కామర్స్‌లో అమ్మకాలకు చర్యలు తీసుకుంటామని బిసి, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం సభ్యులు గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వాలు తెచ్చిన పథకాలన్నింటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన వస్త్ర ప్రదర్శన విజయవంతమైందని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ ప్రతినిధులు పిఎం త్రినాథ్, టి మోహన్‌కృష్ణ, ఆనంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.