రెండో రోజూ అదే డిమాండ్‌

Jan 8,2025 23:29 #FPPCA, #Objection, #Surcharges, #True up
  • ట్రూ అప్‌, ఎఫ్‌పిపిసిఎ, సర్‌ఛార్జీలపై అభ్యంతరం
  • విజయవాడలో ముగిసిన ఎపిఇఆర్‌సి అభిప్రాయ సేకరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై మోయలేని భారంగా మారడం, పరిశ్రమలు మూతకు కారణమవుతున్న ట్రా అప్‌ ఛార్జీలు, ఎఫ్‌పిపిసిఎ, సర్‌ఛార్జీలను రద్దు చేయాలని పలు పార్టీలు, వివిధ సంఘాలు, వినియోగదారులు, పరిశ్రమల యజమానులు.. విద్యుత్‌ నియంత్రణ మండలి దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడలోని ఓ ప్రైవేటు పంక్షన్‌ హాలులో విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై ప్రజాభిప్రాయసేకరణ రెండో రోజైన బుధవారం కొనసాగింది. అభ్యంతరాలను మండలి ఛైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌, సభ్యులు పి వెంకటరామరెడ్డి వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లో స్వీకరించారు.

అదానితో ఒప్పందానికి ఎపిఇఆర్‌సి అనుమతిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఎపిఇఆర్‌సికి తమ అభ్యంతరాలు తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వాలు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడంపైనా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కోరినట్లు చెప్పారు. అదానితో ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. సిఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్‌ మీటర్లు, అదానితో విద్యుత్‌ ఒప్పందాలను వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన అనంతరం అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులకు నేడు వినియోగదారులు మూల్యం చెల్లించాల్సి రావడంతో ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. అదనపు ఛార్జీలు కట్టలేని పేద, మధ్యతరగతి వినియోగదారులకు సమయం ఇవ్వకుండా కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారని మండలి ఛైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్‌ ప్రమాద బీమాను పెంచాలన్నారు. 20 రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.

విద్యుత్‌ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్‌ ఎంవి ఆంజనేయులు మాట్లాడుతూ.. స్మార్ట్‌ మీటర్ల వల్ల ప్రయోజనం ఉందని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. దేశంలో లభ్యమవుతున్న బొగ్గును వదిలి, విదేశాల నుంచి అధిక ధరలకు బొగ్గును దిగుమతి చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలన్నారు.

ఎపి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధి పి కోటిరావు మాట్లాడుతూ.. గ్రీన్‌ పవర్‌ను ప్రోత్సహించాలన్నారు. విద్యుత్‌ ఛార్జీలు ఏటా పెరిగిపోతున్నాయని, దీనికితోడు అదనపు ఛార్జీలతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాజేష్‌బాబు మాట్లాడుతూ.. తన పరిశ్రమకు ఒకేసారి వివిధ ఛార్జీల పేరుతో రూ.4 కోట్లు చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. తగిన సమయం కూడా ఇవ్వకుండా వెంటనే సరఫరా నిలిపివేయడంతో నష్టాల పాలైనట్లు తెలిపారు. విశాఖలో ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు 22 మూతపడినట్లు పేర్కొన్నారు.

గన్నవరానికి చెందిన ఎ జీవా మాట్లాడుతూ.. విద్యుత్‌ సర్వీసు కోసం తాను సబ్‌స్టేషన్‌కు వెళ్లి అడిగితే అధికారులు ఫార్మాలిటీస్‌ ఇవ్వాలన్నారని మండలి దృష్టికి తీసుకొచ్చారు. తాతా సుబ్రమణ్యం, కుమారస్వామి, తాతినేని వెంకటేశ్వరరావు, పి సాంబశివరావు, గణేష్‌, హనుమయ్య తదితరులు తమ అభ్యంతరాలను తెలియజేశారు.

అభిప్రాయం వ్యక్తం చేసిన 60 మంది

విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్వహించిన రెండు రోజుల ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 60 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండో రోజైన బుధవారం 59 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ప్రత్యక్షంగా 14 మంది, ఆన్‌లైన్‌లో 25 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొదటి రోజు 27 మంది నమోదు చేసుకోగా, 11 మంది ప్రత్యక్షంగా, 10 మంది ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల ఎమ్‌డిలు, ఎపిఇఆర్‌సి అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️