- లెనిన్ శతవర్ధంతి సభలో ప్రొఫెసర్ వికె రామచంద్రన్
ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : ‘అధికార మార్పిడి జరిగినంత మాత్రానా సమసమాజ స్థాపన సాధ్యం కాదు.. పాలకవర్గ స్వరూపంలోనే మార్పు రావాల్సి ఉంది’ అని కేరళ ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ప్రొఫెసర్ వికె రామచంద్రన్ తెలిపారు. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ‘రాజ్యం-విప్లవం’ అన్న అంశంపై అనంతపురంలోని అలేఖ్య ఫంక్షన్ హాలులో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రామచంద్రన్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. తొలుత లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రన్ మాట్లాడుతూ.. నేటి పెట్టుబడిదారి వ్యవస్థలో పేద, ధనికుల మధ్య అంతరాలు అనివార్యమని మార్క్సు, లెనిన్‌లు ఇద్దరూ ఆనాడే తమ రచనల ద్వారా తెలియజేశారని గుర్తు చేశారు. ఈ సమాజంలో పాలకవర్గాలన్నీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకే పని చేస్తాయని తెలిపారు. అందుకే సమాజంలో ఆర్థిక అసమానతలు అధికమని వివరించారు. రష్యాలో సోవియట్ పతనమైన తరువాత పెట్టుబడీదారి వ్యవస్థ మరింత బలపడిరదన్నారు. మన దేశంలోనూ స్వాతంత్రానికి పూర్వం సమసమాజ భావనలే అధికంగా ఉండేవని తెలిపారు. అయితే క్రమంగా మారుతూ బడా పెట్టుబడి,పెట్టుబడి, భూస్వామ్య లక్షణాలు పెరిగాయని పేర్కొన్నారు. 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు దేశంలో అమలు చేయడం ప్రారంభించాక మరింత వేగవంతమయ్యాయని, దీనికి మతతత్వం కూడా తోడైందని తెలిపారు. అప్పటి నుంచి ఆర్థిక అంతరాలు మరింతగా పెరిగాయని పేర్కొన్నారు. మరోవైపు పేదరికం, దారిద్య్రం కూడా పెరుగుతోందని తెలిపారు. ప్రతి నలుగురు చిన్నారుల్లో ముగ్గురికి సరైన పౌష్టికాహారం లభించడం లేదన్నారు. ఇది యునెస్కో చెబుతున్న గణాంకాలేనని వివరించారు. కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ అంతరాలు పోవాలంటే పాలకవర్గ స్వభావం మారాల్సి ఉందని తెలిపారు. స్వభావం మారడమంటే సమాజ మార్పు జరగాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్ మాట్లాడుతూ.. నేటి పరిస్థితుల్లో లెనిన్ ఆలోచనలను మరోమారు పునరుచ్ఛరణ చేసుకోవాల్సి ఉందని తెలిపారు. అందుకోసమే ఆయన శతవర్ధంతి సభలను రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ ఏడాది నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.సావిత్రి, ఒ.నల్లప్ప, బాలరంగయ్య, నాగేంద్ర, నగర కార్యదర్శి వి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.