ఒకే వీధి-2 నియోజకవర్గాలు-2 జిల్లాలు – ఓటర్లు వేరు..!

ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : కోటనందూరు మండలంలోని భీమవరపుకోట గ్రామంలో ఓకే వీధిలో రెండు జిల్లాలు రెండు నియోజకవర్గాలు, రెండు గ్రామాలు, ఓటర్లు వేరువేరుగా ఉండడం గమనార్హంగా ఉంది. ఒకే వీధిలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలం నర్సీపట్నం నియోజకవర్గం వైబి పట్నం గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో టిడిపి అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసిపి అభ్యర్థి పిట్ల ఉమాశంకర్‌ మధ్య పోటీ ఉంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామం ఉంది. జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా యనమల దివ్య, వైసిపి అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజా పోటీలో ఉన్నారు. భీమవరపుకోట గ్రామ ప్రజలు ఐదో వార్డులో ఉండే సుమారు 210 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని చూడగా, వై వి పట్నం గ్రామ ప్రజలు ఒకటో వార్డులో 199 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక వీధిలో ఉంటూ ఒకరికొకరు కలిసి ఉంటూ, పండగ వేళల్లోనూ, శుభకార్యాలలో కలిసి ఉండే వై బి పట్నం, భీమవరపుకోట గ్రామ ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వేరువేరు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, వేరువేరుగా ఓట్లు వేయడం, వేరువేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లడం పట్ల ఆసక్తి నెలకొంది.

➡️