- డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కల్యాణి
- అస్వస్థతకు గురైన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు : ఆస్పత్రి సూపరింటెండెంట్ శిరీష
ప్రజాశక్తి- నక్కపల్లి (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 23 మంది రోగులు అస్వస్థకు గురైన నేపథ్యంలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఎన్.కల్యాణి బుధవారం విచారణ చేపట్టారు. ఇంజక్షన్ శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపిస్తామని తెలిపారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలకు చెందిన పలువురు జ్వర పీడితులు, బాలింతలు, పిల్లలు, డయోరియా బాధితులు మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యాన నర్సులు రోగులకు సిఫోటాక్సిమ్, మెట్రోజల్ ఇంజక్షన్లు ఇచ్చారు. కొద్ది సేపటికే రోగులు జ్వరం, వణుకు, వాంతులతో అవస్థలు పడ్డారు. డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి తక్షణం స్పందించి అస్వస్థతకు గురైన 23 మందిని అనకాపల్లి ఎన్‌టిఆర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో సింహాద్రి పరిస్థితి విషమించడంతో కెజిహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కల్యాణి ఆస్పత్రికి చేరుకున్నారు. డ్రగ్స్‌ను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. రోగులకు ఇచ్చిన ఇంజక్షన్లు శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శిరీష, డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.
సమగ్ర విచారణ జరపాలని సిపిఎం ధర్నా
ఇంజక్షన్లు వికటించి రోగులు అస్వస్థకు గురైన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వద్ద బుధవారం ధర్నా చేశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ శిరీషకు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ డిఎంఅండ్‌హెచ్‌ఒ, రిటైర్డ్ జిల్లా కో-ఆర్డినేటర్లతో వెంటనే సమగ్ర విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.