Sand: ఇసుకను నిత్యావసరంగా భావించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇసుకను నిత్యావసర వస్తువుగా భావించి సరఫరాకు ఉన్న అన్ని సమస్యలనూ పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చందబ్రాబు నాయుడు ఆదేశించారు. గనులశాఖ అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్‌ సౌలభ్యతను మెరుగుపరిచేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌తోపాటు రీచ్‌ల వద్ద నేరుగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దీంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోలేని వారు కూడా ఇసుక పొందడం సులభమవుతుందని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని, నిరంతర నిఘాతోపాటు నిత్యం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఇసుక లభ్యత, రవాణా, ఆపరేషన్‌ ఖర్చులు మొదలైన వాటి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందించాలన్నారు. చెకింగ్‌, జిపిఎస్‌, ట్రాకింగ్‌, ఆడిట్‌ విధానాలతో బ్లాక్‌ మార్కెటింగ్‌ జరగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన 108 రీచ్‌లు అందుబాటులోకి రానున్నాయని సిఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇసుక రీచ్‌ల సంఖ్య పెంచేందుకు ప్రైవేటు వ్యక్తులు కూడా మైనింగ్‌శాఖ అనుమతితో తవ్వకాలు ప్రారంభిస్తారన్నారు. అయితే ప్రైవేటు ఇసుక రీచ్‌లలో కూడా డిఎల్‌ఎస్‌సి నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 30 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక సరఫరా అవుతుందన్నారు. ఇసుక రీచ్‌లను జిల్లా స్థాయి శాండ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఏజెన్సీలను జిల్లా కమిటీ టెండర్ల విధానంలో ఎంపిక చేస్తోందన్నారు. ఇసుక రీచ్‌లోని స్టాక్‌ పాయింట్‌ను 24 గంటలు ఆపరేట్‌ చేయడానికి వారికి అనుమతి ఇస్తామన్నారు. దీంతో నిరంతర సరఫరాకు అవకాశం ఉంటుందని చెప్పారు. రీచ్‌ పాయింట్‌ వద్ద ఇసుక సరఫరా రేటు డిఎల్‌ఎస్‌సి నిర్ణయించినట్లుగా ఉండాలని అధికారులను సిఎం ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను త్వరితగతిన అనుమతించడం ద్వారా మార్కెట్‌లో ఇసుక లభ్యతను పెంచాలన్నారు. ఇసుక డెలివరీని వేగవంతం చేసేందుకు మరిన్ని వాహనాలను అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సమావేశంలో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తదితరులు పాల్గన్నారు.

➡️