ప్రజాశక్తి – రాజమహేంద్రవరం : పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు (ఆయాలు) గురువారం ఆందోళనలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ప్లకార్డులతో చేరుకున్నారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యాక్షులు బి పవన్ ఆధ్వర్యంలో డిఇఒ వాసుదేవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, శానిటేషన్ పరికరాలు గ్లౌజులు, మాస్కులు, శానిటేషన్, చీపుర్లు, ఫినాయిల్ వంటివి ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై డిఇఒ మాట్లాడుతూ బడ్జెట్ రాగానే బకాయి వేతనాలు చెల్లిస్తామన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సరోజినీ, దేవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.