రాజ్యసభకు బీద, సతీష్‌, కృష్ణయ్య

Dec 10,2024 00:18
  • కూటమి అభ్యర్థులు ఖరారు
  • రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు టిడిపి కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. టిడిపి నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లకు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడవ రాజ్యసభ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ నుండి ఆర్‌. కృష్ణయ్య బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు వైసిపినుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్‌. కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు అనివార్యమైనాయి. అయితే,రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి వెంకటరమణ తనకు రాజ్యసభ పట్ల ఆసక్తి లేదని మొదటి నుండి చెబుతున్నారు. దీంతో ఆ స్థానం పై జనసేన ఆశలు పెంచుకుంది. కూటమి తరపున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంచేయడంతో పాటు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కూడా అయిన కొణిదెల నాగబాబుకు ఆ పదవి దక్కడం ఖాయమన్న అభిప్రాయం కూటమి వర్గాల్లో నెలకొంది. ఈ మేరకు గట్టి హామీ లభించినట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయమని జనసైనికులు భావించారు. ఆయన కూడా పార్లమెంటుకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఈ పదవిని బిజెపికి కేటాయించాల్సి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో అధికారికంగా నిర్ణయం వెలువడటానికి ముందే, బిజెపి నేతలు ఢిల్లీలో ప్రకటనచేయడం గమనార్హం. ఈ పరిణామం జనసేనలో చర్చనీయాంశంగా మారింది. జనసైనికులతో పాటు నాగబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగింది. దీంతో ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వనున్నారన్న ఊహా గానాలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రమంత్రివర్గం లో 26 మంది వరకు తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 25 మందే ఉన్నారు. ఖాళీగా ఉన్న స్థానంలో నాగబాబును తీసుకుంటున్నారు. వచ్చే మార్చిలో టిడిపి ఎమ్మెల్సీలుగా ఉన్న అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడు, బి తిరుమల నాయుడు, దువ్వారపు రామారావులతో పాటు మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీ స్థానాల నుంచి నాగబాబును ఎమ్మెల్సీగా తీసుకుం టారని భావిస్తున్నారు. మరోవైపు రాజ్యసభకు ఖరారు చేసిన అభ్యర్ధులు మంగళవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి నామినేషను పత్రాలను అందించనున్నారు.

➡️