మున్సిపల్‌ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్ష

  • అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపల్‌ ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. పిఎఫ్‌, అప్‌గ్రేడ్‌, ఉద్యోగోన్నతులు, బదిలీల సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆక్కడ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయుల దీర్ఘ కాలిక సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. జిపిఎఫ్‌ అప్‌గ్రేడేషన్‌, ప్రమోషన్‌, బదిలీల వంటి సమస్యలను పరిష్కరించకుండా విద్యాశాఖ, మున్సిపల్‌ శాఖలు తాత్సారం చేస్తున్నాయన్నారు. యుటిఎఫ్‌ చేసిన పోరాటాల ఫలితంగానే పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలోకి మున్సిపల్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 1800 పైగా పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉండగా నేటికీ అది జరగలేదన్నారు. ఫలితంగా ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగోన్నతులు, బదిలీలు పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. 2017 నుంచి బదిలీలు లేకపోవడం వల్ల రెండేళ్ల క్రితం విద్యాశాఖ ఇచ్చిన సర్వీసు రూల్స్‌ జిఒలు కూడా నేటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల పిఎఫ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పరిధిలోని ఖాతాల్లో ఉన్నాయని, దీంతో వాటిని డ్రా చేసుకునే వీలు లేకుండా పోయిందన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాలో కార్పొరేషన్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్షను కొనసాగించారు. అన్నమయ్య, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.

➡️