ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిత్తూరు జిల్లాకు కొత్త ప్రైవేటు హోమియోపతి కళాశాల మంజూరు చేసినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, ముత్తిరేవుల గ్రామంలో శ్రీనివాస ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యాన హోమియోపతి కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటేశ్వరా హోమియోపతి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ పేరుతో ఏర్పాటు చేసే కొత్త ప్రైవేట్ కళశాలలో ప్రతియేటా 100 మంది విద్యార్థులకు అడ్మిషన్లు మంజూరు చేస్తారన్నారు. సొసైటీలో ఇప్పటికే 50 పడకల ఆస్పత్రి ఉందన్నారు. రాష్ట్రంలో 7 హోమియోపతి కళాశాలలు ఉన్నాయని, ఐదున్నరేళ్ల బిహెచ్‌ఎంఎస్ కోర్సులో ఏడాదికి 500 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నట్లు చెప్పారు. వీటిలో గుడివాడ, రాజమండ్రి, కడపలో 3 ప్రభుత్వ హోమియోపతి కళాశాలలు, గుంతకల్లు, తిరుపతి, తాడేపల్లిగూడెం, విజయనగరంలలో 4 ప్రైవేటు హోమియోపతి కళాశాలలు ఉన్నాయని తెలిపారు.
ఎంబిబిఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌పై సమగ్ర విచారణ
విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాళాశాలలో ఎంబిబిఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ జరిగిన ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి లోతైన విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని డిఎంఇ డాక్టర్ నరసింహను ఆదేశించారు. ఈ ఘటనకు దారి తీసిన వ్యవస్థాగత లోపాలపై దృష్టి సారించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.