ఎస్‌సి, ఎస్‌టిల భూములు కబ్జా

  •  పెత్తందార్ల కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు
  • ప్రజా చైతన్య యాత్రలో తిరుపతి తూర్పు మండలాల్లో వెలుగులోకి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుపతి జిల్లా తూర్పు మండలాల్లో దళితులకు, గిరిజనులకు చెందిన వేలాది ఎకరాల భూములను పెత్తందార్లు కబ్జా చేశారు. వాటిలో కొన్ని భూములను బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అథికారులు పెత్తందార్ల కొమ్ముకాస్తున్నారు. సిపిఎం ఇటీవల నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు మండలాల పరిధిలో సత్యవేడు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 22 మండలాల్లో 38 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి ఉన్నారు. వీరంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. 1972, 1977లో ప్రభుత్వం వీరికి ఇచ్చిన అసైన్డ్‌్‌ భూములను పెత్తందారులు కబ్జా చేశారు. తమ భూములను తమకు ఇప్పించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ బాధితులు ఏళ్ల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో, రోజు గడవడానికి బాధితులు తమ భూముల్లోనే కార్మికులుగా మారాల్చిన దుస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు దళిత సంఘాలు చెప్తున్నాయి. గత నెల ఎనిమిది నుంచి 17 వరకూ సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో ఎస్‌సి, ఎస్‌టిల సమస్యలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సత్యవేడు నియోజకవర్గంలో దళితుల భూములు, స్మశాన వాటికలు కబ్జాకు గురైనట్టు, ఇళ్ల స్థలాల సమస్య తమ దృష్టికి వచ్చినట్టు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్‌ తెలిపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని పిచ్చాటూరులోని ఓబులరాజుకండ్రిగ గ్రామంలోని 66, 67 సర్వే నంబర్లలో పదేళ్ల క్రితం 65 మందికి ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది. ఆ స్థలంలోకి వెళ్లడానికి దారి లేకుండా గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు ఒకరు ఫెన్సింగ్‌ వేసి మూసేశారు. దీనిపై లబ్ధిదారులు పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తాజాగా సర్వే చేసినా సమస్యను పరిష్కరించలేదు. అదే మండలంలో పేరడం గిరిజన కాలనీలోని యానాదులు ఇళ్ల స్థలాల కోసం 15 ఏళ్లుగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. మేత బీడు భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు వారికి అవకాశం కల్పించాలని అధికారులను సిపిఎం కోరింది. ఈ భూములకు పట్టాలు ఇవ్వలేమని తహశీల్దార్‌ తెగేసి చెప్పారు. అయితే, అదే గ్రామానికి చెందిన ఓ టిడిపి నాయకుడు ఈ భూముల్లో 14 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. దీనికి అడ్డుకోకపోగా ఆ నాయకుడికి రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. సత్యవేడు మండలం కొత్తమారికుప్పం దళితవాడ చెందిన వారి 300 ఎకరాలను పెత్తందారులు ఆక్రమించారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన మూడు వేల ఎకరాల భూములను పెత్తందార్లు కబ్జా చేసి చెన్నరుకి చెందిన కొందరి పారిశ్రామికవేత్తలకు విక్రయించేశారు. గాజులపెళ్లూరులో వెయ్యి ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కుక్కంబాకం రెవెన్యూలో తాము సాగు చేసుకుంటున్న 80 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వాలని దళితులు కోరుతున్నా రీ సర్వే సాకుతో అధికారులు పరిష్కారం చూపలేదు. కెవిబిపురం మండలం రాజులకండ్రిగలో సర్వే నంబర్‌ 416లో 13 ఎకరాల్లో, 254 సర్వే నంబర్‌లో 12 ఎకరాల్లో ఎస్‌సి, ఎస్‌టిలు మామిడి సాగు చేసుకుంటే, ఆ గ్రామ పెత్తందారులు ఈ 25 ఎకరాల్లోని మామిడి చెట్లను అక్రమంగా తొలగించి ఆ భూములను కబ్జా చేశారు. బాధితుల పక్షాన నివాల్సిన పోలీసులు పెత్తందార్ల కొమ్మకాసి ఎస్‌సి, ఎస్‌టిలపై అక్రమ కేసులు బనాయించారు. మఠం గ్రామ పంచాయతీ దళిత మాజీ సర్పంచ్‌ వెంకటయ్యకు చెందిన ఐదు ఎకరాల డికెటి భూములను అదే గ్రామానికి చెందిన పెత్తందారు ఆక్రమించాడు.

త్వరలో రణభేరి : జనార్థన్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ వభ్యులు

పరిశ్రమల ముసుగులో భూసేకరణ పేరుతో తూర్పు మండలాల్లో వేలాది ఎకరాలను ఎస్‌సి, ఎస్‌టి నుంచి ప్రభుత్వం లాక్కొంది. సత్యవేడు ఎస్‌ఇజడ్‌ పరిహారాన్ని లబ్ధిదారులైన ఎస్‌సి, ఎస్‌టిలకు కాకుండా వారి భూములను కబ్జా చేసిన పెత్తందార్లకు అధికారులు ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలి. అన్ని మండలాల్లోనూ సర్వే చేసి ఎస్‌సి, ఎస్‌టిల అనుభవంలో ఉన్న భూములను పట్టాలిచ్చి వారికి అప్పగించాలి. ఇందుకోసం వారిని సమీకరించి ‘రణభేరి’ పేరిట కలెక్టరేట్‌ వద్ద త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నాం.

➡️