- కెవిపిఎస్ వినతి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి పాలనలో కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురై డోర్ డెలివరీ కాబడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ కమిషనరు ఎంఎం నాయక్‌ను బుధవారం కెవిపిఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. సిఎం అధ్యక్షతన ప్రతి ఆరు నెలలకు ఒకసారి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు జరగాల్సి ఉన్నా ఒక్క సమావేశం కూడా జరగలేదన్నారు. రాజ్యాంగ బద్దమైన ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు ఛైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్‌సి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, రుణాలివ్వాలని, భూములు కొని ఇవ్వాలని తాము కోరుతున్నట్లు మాల్యాద్రి తెలిపారు. గత పదేళ్లుగా భర్తీ చేయని ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దళిత యువకుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి
కాకినాడ పట్టణం, మహాలక్ష్మినగర్ మేకల కబేలా సమీర్‌పేటకు చెందిన దళితుడు ఉండ్రాజవరపు నానిపై దాడి చేసిన అగ్రకుల దుండగులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లప్ప, మాల్యాద్రి డిమాండ్ చేశారు.