– టిడిపి కూటమి ప్రభుత్వానికి సిపిఎం డిమాండ్
– అమరావతి, పోలవరంతో పాటు ఇతర అంశాలకూ ప్రాధాన్యమివ్వాలి
– ప్రజల కోసం ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
– బిజెపి విషయంలో టిడిపి, జనసేన, వైసిపి వైఖరి ఒక్కటే
– పొంచి ఉన్న మతతత్వ ప్రమాదం
– లౌకిక వాదులను కూడగట్టి విశాల వేదికల ఏర్పాటు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :తెలుగుదేశం, కూటమి పార్టీల నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ పథకాల అమలుకు షెడ్యూలు ప్రకటించాలని సిపిఎం డిమాండ్ చేసింది. శుక్రవారం వడ్డేశ్వరంలో ప్రారంభమైన పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీర్మానం ప్రతిపాదించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాల అమలును వెంటనే ప్రారంభించాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల సంక్షేమానికి ప్రకటించిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో భాషా వలంటీర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అసంఘటిత కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, కార్మిక చట్టాల అమలుపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని అన్నారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమ బోర్డు, ప్రమాదకర ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కిందిస్థాయి ఉద్యోగులను బలవంతంగా తొలగించడం, వేధించడం, రేషన్ డీలర్లను తొలగించడం, తమ పార్టీ వారిని నియమించుకునే పనులు చేస్తున్నారని అన్నారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను స్థానిక సంస్థలకు బదలాయిస్తామని ప్రకటించారని, ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరించబోమని ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తామని తెలుగుదేశం ఉన్నత నాయకత్వం ప్రకటించిందని, మరోవైపు రెడ్‌బుక్ పేరుతో బెదిరింపులూ కొనసాగుతున్నాయని తెలిపారు. పాత ప్రభుత్వ కీలకస్థానాల్లో నియమించిన అనేక మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను భారీగా ట్రాన్స్‌ఫర్లు చేసిందని, కొందరిని లూప్‌లైన్లో పెడితే కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో విభజన హామీలు, కడప స్టీలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రస్తావన చేయలేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తెలుగుదేశం, జెడియుపై అధారపడి ఉందని, నితీష్‌కుమార్ ప్రత్యేక హోదా డిమాండు చేస్తుంటే చంద్రబాబు నోరెత్తడం లేదని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. ఉక్కుపై తెలుగుదేశం కేంద్రంతో రాజీపడిందని వార్త రాసిన డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై విశాఖలో టిడిపి కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో జనసేన ముఖ్యపాత్ర పోషిస్తోందని, అదే సమయంలో బిజెపి, జనసేన మధ్య బంధం బలపడుతోందని తెలిపారు. జనసేన యువతను ఉపయోగించుకుని బలపడేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, పవన్ మాట్లాడుతున్న తీరు, వాడుతున్న భాష బిజెపి మతోన్మాదానికి ఊతమిచ్చేలా ఉందని పేర్కొన్నారు.
సరళీకరణ విధానాలను చురుగ్గా ప్రతిఘటించాలి
కొత్త ప్రభుత్వం సరళీకరణ విధానాలు చురుకుగా అమలు చేసే అవకాశం ఉందని, ప్రజలకు హాని చేసే అంశాలపై పార్టీ, ప్రజా సంఘాలు చురుకుగా ప్రతిఘటించాలని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు హిందూత్వ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికారంలో భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుని ప్రయత్నిస్తాయని, వాటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు లౌకికశక్తులను కూడగట్టి విశాల ఐక్యవేదికను నిర్మించాలని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కాలరాసే కేంద్ర విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని తెలిపారు. టిడిపి, జనసేన, వైసిపిలు బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రమాదకర వైఖరిని బట్టబయలు చేయాలని సూచించారు. ప్రజలను వేధిస్తున్న తక్షణ సమస్యలపై ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు, ప్రజా రంగాల్లో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు చురుకుగా కదిలి, ఆందోళనలు పోరాటాలు నిర్వహించాలని, ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. కొత్త ఇసుక పాలసీలో రవాణా, లోడింగ్, జిఎస్‌టి, సహా హ్యాండ్లింగ్ ఛార్జీలతో వినియోగదారులకు తక్కువ ఉపశమనం కలుగుతోందని అన్నారు. మెగా డిఎస్‌సి ప్రకటించినా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు న్యాయం జరిగే విధంగా వ్యవహరించలేదని తెలిపారు. జిఓ3ను పునరుద్ధరించి స్పెషల్ డిఎస్‌సిని నిర్వహించాలని నిరుద్యోగులు మంత్రికి విన్నవించారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం యువతలో అనేక ఆశలు కల్పించిందని, డ్రగ్స్ నిరోధంపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధ్యతను విస్మరించిన వైసిపి
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి తన బాధ్యతను విస్మరించిందని, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోతే అసెంబ్లీకి రాను అని జగన్ చెప్పడం బాధ్యతారాహిత్యమైన చర్యని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూనే, అది భాగస్వామిగా ఉన్న కేంద్రాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్రానికి అంశాలవారీ మద్దతు ప్రకటించిందని, స్పీకర్ ఎన్నికల సమయంలోనూ మద్దతు ప్రకటించిందని తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ను ప్రతిపక్షాలను కేటాయించాలన్న సాంప్రదాయాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం, జనసేన మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బిజెపి విషయంలో రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీల వైఖరుల్లో ఎటువంటి మార్పూలేదని అన్నారు. పరిపాలనలో భాగస్వామ్యంగా ఉండటం రాష్ట్ర ప్రయోజనాలతోపాటు, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు దెబ్బ తగులుతుందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర హక్కులు, అభివృద్ధి, లౌకికతత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు.
రాజధాని నిర్మాణంలో జాగు వద్దు
అమరావతి రాజధాని, పోలవరం ప్రాధాన్యతగా ప్రకటించారని, మాస్టర్‌ప్లాను పేరుతో జాగు చేయకుండా రాజధాని అవసరాల మేరకు సౌకర్యాలను తక్షణం ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని, భవిష్యత్‌లో అనిశ్చితికి తావులేని విధంగా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే పనులు పూర్తి చేయాలన్నారు.
నిర్వాసితులకు భరోసా కల్పించలేదు
గత ప్రభుత్వ తప్పుడు విధానాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని, దీనిలో పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని అన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెబుతున్నా దానిపై విచారణకు సిద్ధపడటం లేదని పేర్కొన్నారు. అమరావతి, పోలవరమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి సమగ్రమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాల తగ్గింపుపై హామీనిచ్చినా శ్వేతపత్రంలో వాటి ప్రస్తావన లేదని అన్నారు. అదానీ లాంటి కంపెనీలకు భూముల కేటాయింపు, తప్పుడు కేటాయింపులపై సమీక్షకు ఈ ప్రభుత్వం సిద్ధపడటం లేదని అన్నారు.
