- శ్రీశైలానికి చంద్రబాబు ఇలా..
- పర్యాటకరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని పకటన
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో,కర్నూలు ప్రతినిధి : ‘విజయవాడ పున్నమిఘాట్ నుండి సీ ప్లేన్‌లో శ్రీశైలం పాతళ గంగ వరకు… అక్కడి నుండి రోప్‌వేలో శ్రీశైలానికి..’ అక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి అదే విధంగా విజయవాడకు…! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన సాగిన తీరిది! అంతకుముందు శనివారం మధ్యాహ్నాం పున్నమిఘాట్‌లో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీ ప్లేన్‌లో ప్రయాణం చేసి శ్రీశైలంకు చేరుకున్నారు. పాతాళగంగలో సీ ప్లేన్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో అక్కడకు చేరుకున్న ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షధ్వానాలు చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుండి రోప్‌వేలో శ్రీశైలానికి చేరుకున్న చంద్రబాబు నేరుగా మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు. అంతకుముందు విజయవాడలో మాట్లాడుతూ రానున్న రోజులో రాష్ట్ర పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుందని చెప్పారు. పర్యాటక రంగ అభివృద్దితో లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఎన్ని కష్టాలున్నప్పటికీ వాటిని అధిగమించి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో పిపిపి విధానంలో సంపద సృష్టికి అపార అవకాశాలున్నాయని, నాలెడ్జ్ ఎకానమిలో పెనుమార్పులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక విధానంతో కృషి చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే టూరిజం రాదని, ప్రశాంత వాతావరణం ఉంటే ప్రపంచం మొత్తం రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పైకి నెట్టివేసిందని, రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నామని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్దిక కార్యకలాపాలు పెంచడానికి . ఉపాది ఉద్యోగావకాశాలు సృష్టించడానికి అందుబాటులోని అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
టూరిజం డెస్టినేషన్‌గా ఎపి
ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీ ప్లేన్ ద్వారా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి బయల్దేరి శ్రీశైలం పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన జెట్టి వద్ద దిగారు. దీంతో సీ ప్లేన్ ప్రయోగం విజయవంతమైంది. అక్కడి నుండి రోప్‌వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీ వేసి శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. నల్లమల అడవులను పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని తెలిపారు. గండికోటకు కూడా సీ ప్లేన్ నడుపుతామన్నారు. గండికోట అభివృద్ధికి రూ.80 కోట్ల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అరకు, లంబసింగి, రిషికొండ, తిరుపతి వంటి పట్టణాలను కలపగలిగితే పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.440 కోట్లతో నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను నాశనం చేశారని, దీనిని రూ.990 కోట్లతో సమాంతరంగా కడుతున్నామని తెలిపారు. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా ప్రకటించామని, డ్రోన్ పైలెట్లను తయారు చేస్తామని వివరించారు. గోదావరి నుంచి బనకచర్లకు నీళ్ళు తెస్తామన్నారు. ఆత్మకూరు, శ్రీశైలం రోడ్డుపై కూడా శ్రద్ధ పెడతామని తెలిపారు. అనంతరం రోప్‌వే ద్వారా పాతాళగంగ చేరుకుని అక్కడి నుండి సీ ప్లేన్ ద్వారా విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, ఎన్‌ఎండి ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి, ఎంపి బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కలెక్టర్ జి.రాజకుమారి, డిఐజి కోయ ప్రవీణ్, ఎస్‌పి అధిరాజ్ సింగ్ రాణా, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.