రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్ డేట్స్

Jul 23,2024 10:47 #ap assembly, #meetings

అమరావతి: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లు, హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరగనుంది.
ప్రశ్నోత్తరాలతో రెండో రోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం పవన్‌ను సభ్యులు తొలి ప్రశ్న అడిగారు. ఆర్ధిక సంఘం నిధుల మళ్లింపుపై మండలి సభ్యుల ప్రశ్నలు అడగగా.. ఉపముఖ్యమంత్రి పవన్‌ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని పవన్‌ చెప్పారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా.. గత ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు నిధులను బదలాయించడంలో జాప్యం చేసిందన్నారు. వచ్చిన నిధులను పంచాయతీలకు బదలాయుంచడంలో జరిగిన జాప్యం వల్ల కేంద్రానికి రూ. 11 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. భారీ ఎత్తునే నిధుల మళ్లింపు జరిగిందని.. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 2165 కోట్ల మేర పంచాయతీల నిధులను నేరుగా డిస్కంలకు చెల్లించారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. సర్పంచులకు తెలియకుండా డిస్కంలకు చెల్లింపులు జరపడం సరైన విధానం కాదన్నారు.

ప్రశ్నోత్తరాలతో రెండో రోజు మంత్రి లోకేష్‌కు తొలి ప్రశ్నతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాడు-నేడు పనులపై సభ్యులు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నాడు-నేడు పనుల్లోని అవకతవకలపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే శ్రావణ్‌ కోరారు. పనులు చేయకుండానే బిల్లులు తీసేసుకున్నారని.. నాడు-నేడులో పనులు చేపట్టి.. ఆ తర్వాత అదే స్కూళ్లను మూసేశారని ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. నాడు-నేడు పనుల పేరుతో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని ధూళిపాళ ఆరోపణలు చేశారు.
నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. తొలి ఏడాదిలో కేజీ-పీజీ వ్యవస్థను ప్రక్షాళన చేపడతామని లోకేష్‌ స్పష్టం చేశారు. నాడు-నేడు పనులపై విచారణ ఏ విధంగా చేపడతారో సభలో ప్రకటించాలని స్పీకర్‌ అయ్యన్న కోరగా.. సభ్యులు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టి.. సభలో నివేదిక పెడతామని లోకేష్‌ వెల్లడించారు రకరకాల సిలబస్‌ల పేరుతో విద్యార్థులను గత ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని లోకేష్‌ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం విద్యా వ్యవస్థను గాడిలో పెడతామని లోకేష్‌ పేర్కొన్నారు.

గ్రూప్‌ -1 పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ.. పరిశీలనకు మంత్రి పయ్యావుల హామీ
అమరావతి: గ్రూపు 1 పరీక్ష అక్రమాలపై గత ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పు బట్టారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ నియామక పరీక్షపై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ధూళిపాళ్ల డిమాండ్‌ చేశారు. సభ్యుల సూచనల మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్‌ సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ -1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని.. గ్రూప్‌-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఓ విద్యా సంస్థలో జరపాల్సిన మూల్యాంకనం.. హ్యాపీ రిసార్టులో జరిపారని ఆరోపణలు చేశారు. గ్రూపు 1 పోస్టుల భర్తీ విషయంలో రూ. 300 కోట్లు అవినీతి జరిగిందని.. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఐపీఎస్‌ అధికారులు గౌతమ్‌ సవాంగ్‌, పీఎస్సార్‌ ఆంజనేయులుతో పాటు పలువురు వైసీపీ నేతలు ఏపీపీఎస్సీలో ఉండి అక్రమాలకు సహకరించారని ఆరోపించారు.
ఈ విషయంపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్‌ సమాధానమిచ్చారు. గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహణ లో అక్రమాలు జరిగింది నిజమేనని.. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మాన్యువల్‌ మూల్యాంకనం కాకుండా డిజిటల్‌ మూల్యాంకనం చేశారని చెప్పారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారన్నారు. గ్రూపు 1 అక్రమాల పై ప్రభుత్వం కూడా విచారణ కమిటి వేసిందన్నారు. ఆగస్ట్‌ 31 లోగా నివేదిక వస్తుందని.. నివేదిక వచ్చిన తర్వాత సభ్యుల కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

➡️